YS Viveka Murder Case: వివేకా హత్య కేసు, తెలంగాణ హైకోర్టులో ఈ నెల 25న విచారణకు ఎంపీ అవినాష్‌ రెడ్డి పిటిషన్‌, విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పు

సుప్రీంకోర్టు సూచించింది. ముందుస్తు బెయిల్‌ కోసం ఎంపీ అవినాష్‌ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసుకునే హక్కు అవినాష్‌ రెడ్డికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Supreme Court. (Photo Credits: PTI)

Hyd, May 23: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి పిటిషన్‌ను ఈ నెల 25న విచారించాలని తెలంగాణ హైకోర్టుకు.. సుప్రీంకోర్టు సూచించింది. ముందుస్తు బెయిల్‌ కోసం ఎంపీ అవినాష్‌ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసుకునే హక్కు అవినాష్‌ రెడ్డికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

తన తల్లి అనారోగ్యం కారణంగా వారం రోజులపాటు సీబీఐ విచారణకు హాజరుకాలేనని, అందువల్ల తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ తక్షణం విచారించి నిర్ణయం వెలువరించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. విచారణకు హాజరుకాలేని పరిస్థితి ఉన్నందున మధ్యంతర ఉపశమనం ఇవ్వాలని అవినాష్‌రెడ్డి ఆ దరఖాస్తులో విన్నవించారు. కోర్టు ఈ కేసును మంగళవారం జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం ముందు లిస్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణపై తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ, ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన అత్యున్నత ధర్మాసనం

మంగళవారం విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌కు వెళ్లాలని అవినాష్‌ రెడ్డికి జస్టిస్‌ మహేశ్వరి, జస్టిస్‌ నరసింహాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సూచించింది. అదే సమయంలో.. అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. సీబీఐ అరెస్ట్‌, విచారణ నుంచి వారంరోజుల పాటు మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిని జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా లేమని వ్యాఖ్యానించింది.ముందస్తు బెయిల్‌పై ఈనెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీలైనంత వరకు అదేరోజు విచారణ ముగించేందుకు ప్రయత్నించాలని సూచించింది. అన్ని పక్షాలు వెకేషన్‌ బెంచ్‌ ముందే వాదనలు వినిపించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

ఆందోళనకరంగా వైఎస్‌ అవినాష్‌రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి, హెల్త్‌బులిటెన్‌ విడుదల చేసిన విశ్వభారతి వైద్యులు

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 25న అవినాష్‌ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరపనుంది. గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చామని, అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సత్వర నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సమయంలో సునీతారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తాము ఈ కేసు మెరిట్స్‌ లోపలికి వెళ్లడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా చెప్పాలనుకుంటే తెలంగాణ హైకోర్టు ముందుకెళ్లాలని ధర్మాసనం సూచించింది.

పిటిషన్‌ విచారణ సమయంలో ఎంపీ అవినాష్‌ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘ఈ కేసులో సీబీఐ విచారణకు ఇప్పటిదాకా ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఏడుసార్లు హాజరయ్యారు. సీబీఐ విచారణకు అవినాష్‌ సహకరిస్తున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్‌ నిందితుడు కాదు. ఇప్పటికే అవినాష్‌ తండ్రిని అరెస్ట్‌ చేశారు. అవినాష్‌ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు’’ అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.