YSR Asara Scheme: డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్, ఈ నెల 25న మూడో విడత వైఎస్సార్ ఆసరా నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం
ఈ నెల 25న ఏలూరు జిల్లా దెందులూరు వేదికగా వైఎస్సార్ ఆసరా పథకం (YSR Asara Scheme) మూడో విడత నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది
Dendalur, Mar 23: డ్వాక్రా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 25న ఏలూరు జిల్లా దెందులూరు వేదికగా వైఎస్సార్ ఆసరా పథకం (YSR Asara Scheme) మూడో విడత నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) జమ చేయనున్నారు.
ఈ నిధులు విడుదల చేయడం ద్వారా మూడు విడతల్లో మొత్తం రూ.19,178.17 కోట్లను ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసినట్టు అవుతుంది.ఈ డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చు.ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మూడో విడతగా రూ.6,419.89 కోట్లను విడుదల చేయనుంది. కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది.
వైఎస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ ఉత్సవాలను ప్రభుత్వం పది రోజుల పాటు పండుగలా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 5 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహిస్తారు.
రోజుకు కొన్ని గ్రామ సమాఖ్యల పరిధిలో పంపిణీ జరిగే ప్రాంతంలో ఆ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించేందుకు గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదిరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఆయా కార్యక్రమాలకు స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీలతోపాటు సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. మంత్రులు కూడా రోజూ పాల్గొంటారు.