Rain Forecast: తెలుగు రాష్ట్రాలకు రెండు రోజుల పాటు వర్షసూచన, జూన్ నెలలో తెలంగాణలో సాధారణం కంటే 50 శాతం అధిక వర్షపాతం నమోదు, జూలైలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా
హైదరాబాద్‌లో వాతావరణం శుక్రవారం మేఘావృతమై ఉంటుందని, ఉరుములతో కూడిన....
Hyderabad, July 2: తెలుగు రాష్ట్రాల్లో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. నైరుతి నుంచి బంగాళాఖాతం దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు తెలంగాణలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌లో వాతావరణం శుక్రవారం మేఘావృతమై ఉంటుందని, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం పడవచ్చని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం అంచనా వేసింది.
రాష్ట్రంలో నైరుతు రుతుపవనాల కదలిక చురుగ్గా ఉంది, రుతుపవనాల రాక ప్రారంభమైన జూన్ మొదటి వారం నుండి చివరి వారం వరకు తెలంగాణలో 50% అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 130.4 మిల్లీమీటర్లు కాగా, ఈ ఏడాది జూన్ 1 నుండి జూన్ 30 మధ్య కాలంలో 195.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
జూలై నెలలోనూ అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. రాయలసీమ అక్కడక్కడ మోస్తారు వర్షపాతం నమోదు కావొచ్చని ఐఎండీ ప్రకటనలో పేర్కొంది.