Monsoon 2021: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన, రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన భారత వాతావరణ శాఖ; రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా చల్లబడిన వాతావరణం
నైరుతు రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది, మరో 5 రోజుల వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ స్పష్టం చేసింది....
Hyderabad, June 25: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) కేంద్రం అంచనా వేసింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం, పశ్చిమ మరియు వాయువ్య దిశల నుండి బలమైన గాలుల ప్రసరణ కొనసాగుతుంది. దీని ప్రభావంతో నైరుతి ఉత్తర ప్రదేశ్ నుండి దక్షిణ ఛత్తీస్‌ఘర్ వరకు జార్ఖండ్ మీదుగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ కారణంగా ఉత్తర మరియు తూర్పు తెలంగాణ ప్రాంతంలో వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ మరియు సూర్యపేట జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుంది" అని IMD తెలిపింది. భారీ వర్షాలు వీధులను ముంచెత్తే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇది హెచ్చరించింది.
నైరుతి రుతుపవనాల కదలికలు బలంగా ఉండటంతో ఏపిలోని పలుచోట్ల రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలొని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని, వీటివల్ల కూడా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. తీరం వెంబడి 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మత్సకారులు చేపల వేటకు వెళ్లడం మంచిది కాదని సూచించింది.
నైరుతు రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది, మరో 5 రోజుల వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ స్పష్టం చేసింది.