Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన, మరో రెండు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు కూడిన వర్షం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత వెంబడి బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా

రాగల 48 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనావేసింది...

Representational Image | (Photo Credits: PTI)

Hyderabad, June 17: నైరుతి రుతువవనాల ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. కాగా, పశ్చిమ దిశ నుండి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపుగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, అలాగే ఉరుములు మెరుపులు, గాలులతో కూడిన వాతావరణం ఉంటుంది. రాగల 48 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనావేసింది.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మరియు కొత్తగూడెం జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది. గురు, శుక్రవారాల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. రాష్ట్రానికి పశ్చిమ, నైరుతి వైపు నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

అయితే, పశ్చిమ దిశ నుండి వీస్తున్న గాలుల ప్రభావం వలన నైరుతి రుతుపవనాల గమనం మందగించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేసినా, ఇప్పుడు వాతావరణ పరిస్థితులు మారిపోవడంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.