TS's COVID19 Status: కోవిడ్ చికిత్సకు ప్రైవేట్ డోపిడిపై హైకోర్ట్ సీరియస్, అదనపు ఛార్జీలు తిరిగి చెల్లించాల్సిందేనని ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు; విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం జూన్ 5 నుంచి ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్
ఇందులో భాగంగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు జూన్ 5 నుంచి టీకాల పంపిణీ చేయాలని నిర్ణయించారు....
Hyderabad, June 3: కోవిడ్ చికిత్స పేరుతో జనాలను నిలువునా దోచుకుంటున్న ప్రెవేట్, కార్పోరేట్ ఆసుపత్రులను నియంత్రించేలా ప్రభుత్వం ఎలాంటి జీవో జారీచేయకపోవడం పట్ల హైకోర్ట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆసుపత్రులు వేసిన అదనపు ఛార్జీలను బాధితులకు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేవలం లైసెన్సులను మాత్రమే రద్దు చేస్తే ఒరిగేదేం లేదని , క్రిమినల్ కేసులు, భారీ జరిమానాలు విధించే అవకాశాలు పరిశీలించాలని సూచించింది. అలాగే థర్డ్ వేవ్ ను ఎలా ఎదుర్కొంటున్నారో అందుకు సంబంధించిన బ్లూప్రింట్ ను ఈనెల 10 లోపు కోర్టుకు సమర్పించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను హైకోర్ట్ ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జూన్ 10కి వాయిదా వేసింది.
ఇక, రాష్ట్రంలోని కేసులను పరిశీలిస్తే, తెలంగాణలో బుధవారం 2,384 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కోవిడ్ బారి నుంచి 2,242 కోలుకున్నారు. అలాగే కరోనాతో పోరాడి 17 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33,379 ఆక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ తన నివేదికలో వెల్లడించింది.
మరోవైపు రాష్ట్రంలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు జూన్ 5 నుంచి టీకాల పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీని కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుంది. అర్హత గల లబ్ధిదారులు అడ్మిషన్ కార్డు, వీసా లేదా విమాన టికెట్ వివరాలను https://www.health.telangana.gov.in లో ఎంట్రీ చేసి టీకా కోసం తమ పేరును నమోదు చేసుకోవచ్చు. నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపిఎం) లో ఈ ప్రత్యేక టీకా డ్రైవ్ కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయబడుతుంది.