101 Goats Sacrificed For Owaisi After Attack: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ కోసం 101 మేకలను బలి ఇచ్చిన అభిమాని, ఇ
హైదరాబాద్ ఓల్డ్ సిటీ యాకుత్ పురా పరిధిలోని బాగ్ ఎ జహానారా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి అసదుద్దీన్ అభిమాని.
హైదరాబాద్, ఫిబ్రవరి 5: హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పుల ఘటన అనంతర పరిణామాలు కొనసాగుతున్నాయి. కాల్పుల ఘటనలో ఒవైసీ ప్రాణాలతో బయటపడిన క్రమంలో దేశ వ్యాప్తంగా ఎంఐఎం కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ బడా వ్యాపారి అసద్ పేరు మీద ఏకంగా 101 మేకలను బలిచ్చాడు.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ యాకుత్ పురా పరిధిలోని బాగ్ ఎ జహానారా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి అసదుద్దీన్ అభిమాని. ఎంఐఎం పార్టీకి ఆర్థికంగానూ సహకారం అందిస్తుంటాడు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పుల వార్త విని కంగారుపడ్డాడు. తన ప్రియతమనేత ప్రాణాలతో బయయటపడటంతో అల్లాకు దువా చెల్లించుకోవాలనుకున్నాడు. ప్రత్యేక ప్రార్థనల్లో భాగంగా ఇవాళ(ఆదివారం) ఉదయం 101 మేకలను బలిచ్చాడా వ్యాపారి. ఈ కార్యక్రమానికి మలక్ పేట్ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా సైతం హాజరయ్యారు. అనంతరం ఆ ప్రాంతంలోనే భారీ విందు ఏర్పాటు చేశాడు. ఒవైసీ కోసం ఓల్డ్ సిటీ వ్యాపారి 101 మేకల్ని బలిచ్చిన వార్త వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఒవైసీ తన పార్టీ నేతలతో కలిసి మీరట్ నుంచి ఢిల్లీకి వస్తుండగా గురువారం నాడు చిజారసీ టోల్ ప్లాజా వద్ద కాల్పులు జరగడం, ఒవైసీ ప్రయాణిస్తోన్న వాహనానికి బుల్లెట్లు తగలడం, ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఆయన మరో కారులో ఢిల్లీకి వెళ్లడం, ఈ ఘటనను కేంద్ర హోం శాఖ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సీరియస్ గా తీసుకోవడం, మజ్లిస్ నేతకు జెడ్ కేటగిరీ భద్రత కేటాయించడం తెలిసిందే. అయితే, తాను ఏ కేటగిరీ పౌరుడిగా ఉండాలని కోరుకుంటానేతప్ప, జెడ్ ప్లస్ కేటగిరీ వద్దని అసద్ పార్లమెంటులో ప్రకటించారు. కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఒవైసీపై కాల్పుల ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫిబ్రవరి 7న పార్లమెంటులో వివరణ ఇచ్చే అవకాశాలున్నాయి.