Car Accidents: కరీంనగర్‌లో అక్కడ వరుస ప్రమాదాలు, అదృశ్యమైన ఎమ్మెల్యే బంధువుల కారు 20 రోజుల తర్వాత కాలువలో నుంచి బయటకు, మరో ప్రమాదంలో సాయం చేయడానికి వెళ్లిన డ్యూటీ కానిస్టేబుల్ దుర్మరణం

ఆ తర్వాత కొన్నాళ్లకు వీరి జాడలేదని స్థానిక మీడియాల్లో కథనాలు వచ్చాయి, అయినా అంతగా ప్రాధాన్యత లభించలేదు. వీరు తరచుగా తీర్థయాత్రలు వెళ్తారని, ఆ క్రమంలోనే ఎక్కడికైనా వెళ్లి ఉంటారేమో అనుకున్నామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే 20 రోజుల తర్వాత ఫిబ్రవరి 17న వీరి శవాలుగా కారులో బయటపడటం....

Car found in a canal near Karimnagar | Photo: Twitter

Karimnagar, February 18:  కరీంనగర్ శివారులోని అలుగునురు (Alugunuru)  వద్ద వరుస ప్రమాదాలు (Accidents)  మిస్టరీగా మారుతున్నాయి. మొన్న ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనం ఒకటి అదుపుతప్పి కాకతీయ కాలువలో  (Kakatiya Canal) పడిపోయింది.  బైక్ పై ప్రయాణిస్తున్న గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన దంపతులు కాలువలో కొట్టుకుపోయారు. దీంతో వారికోసం కాలువలో వెతుకుతుండగా ఆ ప్రదేశానికి ఒక కిలోమీటర్ దూరంలో నీటిలో మరో కారు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీయగా అందులో ముగ్గురు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభించాయి. కారు నెంబర్ ఆధారంగా ఆరాతీయగా ఆ ముగ్గురూ కూడా పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆత్మ బంధువులుగా తెలిసింది. ముగ్గురిలో ఒకరైన నరేడ్డి రాధ (50) ఎమ్మెల్యేకు స్వంత చెల్లెలు, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి (55) మరియు వారి కుమార్తె వినయశ్రీగా గుర్తించారు. వినయశ్రీ బీడీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతోంది.

అయితే, 20 రోజుల తర్వాత కాలువలో వీరి మృతదేహాలు బయటపడటం పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రమాదవశాత్తూ కారు పడిపోయిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో కారణాలు ఇంకా తెలియవు, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నాగార్జున సాగర్ కెనాల్‌లోకి దూసుకెళ్లిన కారు

గతనెల జనవరి 27న వీరు ఇంటి నుంచి బయలుదేరారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వీరి జాడలేదని స్థానిక మీడియాల్లో కథనాలు వచ్చాయి, అయినా అంతగా ప్రాధాన్యత లభించలేదు. వీరు తరచుగా తీర్థయాత్రలు వెళ్తారని, ఆ క్రమంలోనే ఎక్కడికైనా వెళ్లి ఉంటారేమో అనుకున్నామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే 20 రోజుల తర్వాత ఫిబ్రవరి 17న వీరి శవాలుగా కారులో బయటపడటం బాధాకరం అని ఆయన అన్నారు. సోదరి మరియు బావ, మేనకోడలి మృతిపట్ల ఎమ్మెల్యే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో కేసును విచారణ చేస్తున్నామని చెప్పారు. మృతదేహాలు కుళ్లిపోవడంతో అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించారు, మెడలో ఆభరణలు, పర్సు, హ్యాండ్ బ్యాగ్ అన్ని లభించాయన్నారు. కాగా, 20 రోజులుగా ఈ కుటుంబం కనిపించకుండా పోయినపుడు, కనీసం వీరి గురించి ఎవరూ ఫిర్యాదు చేయలేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇక అంతకుముందు చెప్పిన దంపతుల మోటార్ సైకిల్ ప్రమాదంలో పోలీసులు భర్తను రక్షించగా, అతడి భార్య ఆచూకీ దొరకలేదు.  మరోవైపు ఆ ప్రదేశంలో గత రెండు నెలల కాలంలో దాదాపు 15 ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు ఇరుకుగా ఉండటం, చుట్టూ రెయిలింగ్ లేకపోవడంతో వాహనాలు అదుపు తప్పుతున్నాయేమో? అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  గత జనవరిలో  కూడా బైక్ పై వెళ్లిన ఒక జంట ఇదే కాలువలో పడి ప్రాణాలు కోల్పోయారు.

ఇక ఆదివారం జరిగిన మరో ప్రమాదంలో, ఇదే కరీంనగర్ -అలుగునురు సమీపంలో మానేర్ వంతెన వద్ద కారు ఒకటి అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో గండి శ్రీనివాస్ (40) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అతడి భార్య సునీతకు గాయాలవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం జరిగిన చోటులో కారును బయటకు తీసే సహాయక చర్యల్లో పాల్గొంటుండగా కానిస్టేబుల్ చంద్రశేఖర్ గౌడ్ ఆ బ్రిడ్జి పైనుంచి అకస్మాతుగ్గా కింద పడిపోయాడు. దీంతో అతణ్ని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోవడం మరో విషాదం.

హైదరాబాద్‌లో.... (Bharatnagar Flyover Car Accident)

ఇదిలా ఉండగా, ఇటీవల బయోడైవర్సిటీ ఫైఓవర్ నుంచి ఓ కారు పడిన ఘటన మరువక ముందే తాజాగా అలాంటి మరొక ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ (Hyderabad) లోని భరత్ నగర్ ఫ్లైఓవర్ పైనుంచి   సోమవారం రాత్రి ఓ కారు కింద కూరగాయల మార్కెట్ వైపు పడింది. ఈ ఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న సోహైల్ అనే వ్యక్తి మరణించగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.  అయితే కింద ఎక్కువ జనాలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.