Six feared dead as car falls into Nagarjuna Sagar left Canal in nadigudem mandal (Photo_ANI)

Suryapet,October 19: సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం చాకిరాల వద్ద వేగంగా వచ్చిన ఎ కారు అదుపుతప్పి నాగార్జున సాగర్‌ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. మిత్రుడి వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. సాగర్ కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది. కాల్వలో 18అడుగుల లోతు ఉండటం, నీటి ఉధృతి ఎక్కువ గా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదుపుతప్పి నాగార్జున సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన స్కార్పియోను గుర్తించారు.

వాహనం నంబర్ AP31 BP 333. ప్రమాదంలో గల్లంతైన వారంతా హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌లో ఉన్న అంకుర్ హాస్పిటల్‌లో పని చేస్తున్నారు. వీరంతా చాకిరాలలో తమ సహోద్యోగి విమలకొండ మహేష్ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

కొనసాగుతున్న గాలింపు చర్యలు 

గల్లంతైన వారిలో అబ్దుల్ అజీజ్ (వైజాగ్), జిన్సన్ (కేరళ), రాజేశ్, సంతోష్,(హైదరాబాద్) పవన్, నగేష్ (మల్కాజిగిరి) ఉన్నట్టు సమాచారం. మునగాల సీఐ శివశంకర్‌గౌడ్, నడిగూడెం ఎస్సై నరేశ్ తమ సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, సూర్యాపేట కలెక్టర్ అమయ్‌కుమార్, ఎస్పీ భాస్కరన్ చాకిరాలకు వెళ్లి ప్రమాదంపై ఆరాతీశారు. కాల్వలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటి విడుదలను నిలిపివేయించారు. అయినప్పటికీ ప్రవాహం తగ్గకపోగా రాత్రి 11 గంటల ప్రాంతంలో వర్షం పడటంతో అర్ధరాత్రి వరకు ప్రయత్నించి గాలింపు చర్యలను నిలిపివేశారు. శనివారం ఉదయం తిరిగి వారి ఆచూకీ కోసం ప్రయత్నించనున్నారు. కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.