Bhainsa Municipality: భైంసా మున్సిపాలిటీ ఎంఐఎం కైవసం, బీజేపీతో జరిగిన హోరాహోరీ పోరులో పైచేయి సాధించిన మజ్లిస్ పార్టీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గల్లంతు

అయితే ఇక్కడ పట్టులేని బీజేపీ అనూహ్యంగా 9 వార్డులను గెలుచుకుంది....

Bhainsa Municipal Council | File Photo

Nirmal, January 25:  నిర్మల్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీ (Bhainsa Municipality) పై ఎంపీ అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ (AIMIM) జెండా ఎగరేసింది. ఇటీవల భైంసా పట్టణంలో తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. ఎన్నికలకు ముందు రెండు వర్గాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో పట్టణంలో కర్ఫ్యూతో పాటు, కొన్ని రోజుల పాటు నాలుగు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు రద్దు చేయాల్సి వచ్చింది. ఈ రకంగా వార్తల్లో నిలిచిన భైంసాలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపాయి. బీజేపీ- ఎంఐఎం మధ్య హోరాహోరి పోరు నడిచింది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో చివరికి ఎంఐఎం పైచేయి సాధించింది.

హోరాహోరీగా సాగిన పోరులో ఎంఐఎం పైచేయి సాధించింది. భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం పార్టీ కైవసం చేసుకుంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులకు గానూ 15 ఎంఐఎం గెలుచుకోగా, 9 బీజేపీ సాధించింది. రెండు వార్డుల్లో స్వతంత్రులు గెలుపొందారు. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పత్తా లేకుండా పోయాయి.

గత ఎన్నికల్లోనూ భైంసా మున్సిపాలిటీని గెలుచుకున్న ఎంఐఎం, ఈసారి కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేసి పట్టు నిలుపుకుంది. అయితే ఇక్కడ పట్టులేని బీజేపీ అనూహ్యంగా 9 వార్డులను గెలుచుకుంది.

అయితే నిర్మల్ లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ తన జోరు కొనసాగించింది. ఇక్కడి నుంచే మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఈ ఎన్నికలను ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

42 వార్డులున్న నిర్మల్ పురసంఘంలో ప్రస్తుతానికి తెరాస 22, కాంగ్రెస్ 5, బీజేపీ మరియు ఎంఐఎం చెరో వార్డులో గెలుపొందాయి.

జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీలో అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ లభిస్తుంది.