Mini Municipal Polls 2021: తెలంగాణలో ప్రారంభమైన మినీ మున్సిపల్ ఎన్నికలు, కరోనా నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసిన ఈసీ, సాయంత్రం 5 వరకు జరగనున్న పోలింగ్, మే 3న ఫలితాల వెల్లడి

గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీలతోపాటు పలు పురపాలక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి...

Polls 2021 | (Photo-PTI)

Warangal, April 30: కోవిడ్ -19 కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న సమయంలో తెలంగాణలో మినీ మునిసిపల్ పోరుకు అంతా సిద్ధమైంది. రెండు వారాల క్రితం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30, శుక్రవారం నాడు రాష్ట్రంలోని రెండు మునిసిపల్ కార్పొరేషన్లు మరియు ఐదు మునిసిపాలిటీలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇందుకోసం మొత్తం 1,539 పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. బ్యాలెట్ పద్ధతిన ఈ పోలింగ్ జరగనుంది.

పోలింగ్ సిబ్బంది అందరికీ కోవిడ్ ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకోసం పోలింగ్ ప్రక్రియను నిర్వహించే సిబ్బంది అందరికీ మాస్కులు, శానిటైజర్స్, గ్లౌజులు, పీపీఈ కిట్స్ మొదలైనవి అందజేసినట్లు ఎన్నికల కమీషనర్ తెలిపారు. ఓటు వేసేందుకు వచ్చే వారంతా కూడా కరోనా నిబంధనలను పాటించేలా ఏర్పాట్లు చేశామన్నారు.

గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీలతోపాటు పలు పురపాలక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ (జిడబ్ల్యుఎంసి) పరిధిలో 878 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు, వీటిలో 529 కేంద్రాలు క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయి. మరో 46 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యాలు ఉన్నాయి. 231 పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.

అయితే కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కారణంగా పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉంది. జీడబ్ల్యుఎంసిలో మొత్తం ఓటర్ల సంఖ్య 6,53,240 ఉండగా, వీరిలో 3,23,100 మంది పురుషులు, 3,29,964 మంది మహిళలు మరియు ఇతరులు 176 ఉన్నారు.

2016 లో జీడబ్ల్యుఎంసికి మునుపటి ఎన్నికలలో 60.38 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా, ఈసారి అంతకంటే తక్కువే ఉండొచ్చని భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఒట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి మే 3న ఉంటుంది.