Tuni Municipal Vice-Chairman Election

Tuni, Feb 17: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక (Tuni Municipal Vice Chairman Election) మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో నాలుగోసారి ఎన్నికను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు కనీసం 15 మంది కౌన్సిలర్లు ఉండాల్సి ఉండగా.. 10 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికను రద్దు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. అయితే తిరిగి ఎన్నిక ఎప్పుడు నిర్వాహిస్తామనే విషయాన్ని త్వరలోనే చెబుతామని తెలిపారు.

రెండు సార్లు కోరం లేకపోతే కోరంతో సంబంధం లేకుండా ఎన్నిక నిర్వహించే నిబంధన ఉన్న నేపథ్యంలో తదుపరి ఏం చేయాలనే దానిపై ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్తామని అధికారులు చెబుతున్నారు.

వీడియో ఇదిగో, అధికారంలోకి వచ్చాక అందరి బట్టలు ఊడదీసి కొడతాం, కూటమికి వత్తాసు పలికే అధికారులకు వైఎస్ జగన్ మాస్ వార్నింగ్

తునిలో 30కి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సాస్‌పీ పార్టీకి చెందినవారే. అయితే టీడీపీలోకి 10 మంది వెళ్లారు. వైఎస్సార్‌సీపీ చేతిలో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై టీడీపీ నేతలు దాడి చేసి.. మున్సిపల్‌ ఆఫీస్‌లో వెళ్లకుండా అడ్డుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్‌ చేసే ప్రయత్నం చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కనుసన్నుల్లోనే 17 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రాణభయంతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు పరిగెడుతున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

తుని మున్సిపల్‌ వైఎస్‌ ఛైర్మన్‌ ఎన్నిక నాలుగోసారి వాయిదా

మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో పాటుగా మున్సిపల్ ఛైర్మన్ సుధారాణి, కౌన్సిలర్ల పై కేసు నమోదు చేశారు. దాడిశెట్టి రాజా.. నేడు ఛలో తునికి పిలుపునిచ్చారు. ‘చలో తుని’కి పోలీసుల అనుమతి లేదని. వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ వైఎస్సార్‌సీపీ హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు.

చలో తుని కార్యక్రమంలో భాగంగా తుని వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునివ్వగా, ఇవాళ తెల్లవారుజామునుంచి జక్కంపూడి రాజా ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జక్కంపూడి రాజాను గృహ నిర్బంధం చేశారు. కాకినాడ జిల్లా కాకినాడ ప్రత్తిపాడులో వైఎస్సార్‌సీపీ నేత మురళీకృష్ణ రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.