Telangana New DGP: కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్, సీఎం కేసీఆర్‌తో భేటీ, అంజనీ కుమార్ ఫస్ట్ పోస్టింగ్ నుంచి ఎక్కడెక్కడ పనిచేశారంటే...?
ఐపీఎస్ అధికారుల్లో సీనియార్టీ జాబితాలో అంజనీకుమార్ ముందువరుసలో ఉన్నారు. 1966 జనవరి 28న బీహార్‌లో జన్మించిన అంజనీకుమార్.. పాట్నా సెయింట్ జేవియర్ స్కూల్‌లో ప్రాథమిక, ఉన్నత విద్య ను, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు.
Hyderabad, DEC 31: ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (CM KCR) డీజీపీ అంజనీ కుమార్ (Anjani kumar) మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు డీజీపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు తెలంగాణ నూతన డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి(Mahender reddy), సీపీలు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఉదయం తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీలో మహేందర్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.
1992లో జనగామ ఏఎస్పీగా నియమితులైన అంజనీకుమార్ అంచెలంచెలుగా ఎదిగి డీజీపీ అయ్యారు. మహబూబ్‌నగర్ అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా, ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. 1998లో ఐక్యరాజ్యసమితికి డిప్యూటేషన్‌పై వెళ్లి బోస్నియాలో శాంతిదళాలతో కలిసి పనిచేశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చి రెండు మెడళ్లు పొందారు. 2003 వరకు సీఐఎస్‌ఎఫ్‌లో (CISF) పనిచేసి, అనంతరం రాష్ర్ట సర్వీసులకు వచ్చారు. 2005 నుంచి 2011 వరకు గుంటూరు, నిజామాబాద్ రేంజ్ డీఐజీగా, కౌంటర్ ఇంటెలిజెన్స్ డీఐజీగా, గ్రేహౌండ్స్ చీఫ్‌గా విధులు నిర్వర్తించారు. 2011-2012 మధ్యలో వరంగల్ ఐజీగా, 2012-2013 వరకు ఐజీ కమ్యూనికేషన్‌గా, 2018-2021 వరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా, అనంతరం ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
రాష్ట్ర డీజీపీగా నియమితులైన అంజనీకుమార్‌కు ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఐపీఎస్ అధికారుల్లో సీనియార్టీ జాబితాలో జనీకుమార్ ముందువరుసలో ఉన్నారు. 1966 జనవరి 28న బీహార్‌లో జన్మించిన అంజనీకుమార్.. పాట్నా సెయింట్ జేవియర్ స్కూల్‌లో ప్రాథమిక, ఉన్నత విద్య ను, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. ఐపీఎస్ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు రెండు అవార్డులతోపాటు రాష్ట్రపతి పోలీసు మెడల్ అందుకొన్నారు. 2026 జనవరిలో పదవీవిరమణ చేయనున్నారు.