Lucky Draw Cheating: రూ. 11వందలు కడితే బంపర్ డ్రాలో కారు, బంగారం, ఫ్రిడ్జ్.. ఏకంగా 3 వేల మందిని రూ. 5కోట్లు ముంచి ఉడాయించిన సంస్థ
ఇదేదో ఆఫర్ అదిరిపోయింది అంటూ.. చాలామంది అట్రాక్ట్ అయ్యారు. లక్కీ డ్రా లో ఇస్తామన్న బహుమతులకు ఆశపడ్డారు. ఇంకేముంది లక్కీ డ్రాలో చేరిపోయారు. అలా.. 3వేల మెంబర్ షిప్ లు చేయించింది సంస్థ. ఒక్కో వ్యక్తి నుండి ప్రతి నెల 1100 రూపాయలు వసూలు చేసింది.
Hyderabad, FEB 03: మోసగాళ్లు (Crime) రెచ్చిపోతున్నారు. జనాల బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు. మాయమాటలతో నమ్మించి, ఆశ చూపి అడ్డంగా ముంచేస్తున్నారు. దొరికినకాడికి దోచుకుని జంప్ అయిపోతున్నారు. మా కంపెనీలో ఇన్వెస్ట్ మెంట్ చేస్తే భారీ లాభాలు పొందుతారు అంటూ ఓ యాప్ సంస్థ (App) చేసిన ఘరానా మోసం ఇటీవలే హైదరాబాద్ లో వెలుగుచూసింది. తాజాగా అలాంటిదే మరో చీటింగ్ బయటపడింది. ఈసారి లక్కీ డ్రా (Lucky Draw) పేరుతో నిండా ముంచేసిందో ఓ సంస్థ. 5 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. హైదరాబాద్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఈ ఘటన జరిగింది. ప్రశాంతి హిల్స్ డీఎంఎస్ (DMS) అనే సంస్థ లక్కీ డ్రా పేరుతో ప్రతి నెల బహుమతులు ఇస్తామని నమ్మించింది. లక్కీ డ్రా పేరుతో ప్రతి నెల బంగారం, కారు, వెండి, బైకులు, ఫ్రిడ్జ్ టీవీ, వాషింగ్ మిషన్, మొబైల్స్ బహుమతిగా (Gifts) ఇస్తామని ఊరించింది. ఇదేదో ఆఫర్ అదిరిపోయింది అంటూ.. చాలామంది అట్రాక్ట్ అయ్యారు. లక్కీ డ్రా లో ఇస్తామన్న బహుమతులకు ఆశపడ్డారు. ఇంకేముంది లక్కీ డ్రాలో చేరిపోయారు. అలా.. 3వేల మెంబర్ షిప్ లు చేయించింది సంస్థ. ఒక్కో వ్యక్తి నుండి ప్రతి నెల 1100 రూపాయలు వసూలు చేసింది.
అయితే, రోజులు గడుస్తున్నా బహుమతులు మాత్రం ఇవ్వడం లేదు. నిర్వాహకులు ఎలాంటి గిఫ్టులు ఇవ్వకుండా కాలం గడిపేశారు. చివరికి బోర్డు తిప్పేసి పారిపోయారు. దీంతో తాము మోసపోయామని తెలుసుకుని బాధితులు లబోదిబోమన్నారు. డీఎంస్ నిర్వాహకులు ముద్దగొని మదన్ గౌడ్, ముద్దగొని శివ గౌడ్ పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్కీ డ్రా పేరుతో డీఎంస్ సంస్థ నిర్వాహకులు 5 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తెలుస్తోంది. కాగా.. ఈ సంస్థ టార్గెట్ పేద, మధ్య తరగతి వాళ్లే అని పోలీసుల విచారణలో తెలిసింది. గతంలో ఈ సంస్థపై మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.