BRS Khammam Meeting: బీజేపీని తరిమికొట్టడమే మా లక్ష్యం, ఖమ్మం బహిరంగ సభలో గర్జించిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీఆర్ఎస్ సభలో ఎవరెవరు ఏమన్నారంటే..
ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుత భారీ బహిరంగ సభ అని తెలిపారు. బీఆర్ఎస్ విధానం, వ్యూహం తర్వాత వివరంగా చెబుతామన్నారు.
Khammam, Jan 18: బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఖమ్మం సభకు (BRS Khammam Meeting) ప్రజలు భారీగా తరలివచ్చారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal), పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Kerala CM Pinarayi Vijayan), సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరుకావడంతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది. ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఖమ్మం పట్టణం జనసంద్రంగా మారింది.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం సభ దేశంలో ప్రబల మార్పునకు సంకేతమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుత భారీ బహిరంగ సభ అని తెలిపారు. బీఆర్ఎస్ విధానం, వ్యూహం తర్వాత వివరంగా చెబుతామన్నారు. భారత్ అన్ని విధాలా సుసంపన్నమైన దేశం. జలవనరులు, సాగు భూమి విషయంలో మన దేశమే అగ్రగామి. దేశంలో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. కానీ, కేవలం 20వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నాం. బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాస్తోంది.
చైనాలో 5వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ఉంది. మన దేశంలో అతిపెద్దదైన ఒక్క రిజర్వాయర్ ఉందా? రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాల అవసరం ఎందుకు వచ్చింది. కెనడా నుంచి కందిపప్పు దిగుమతి సిగ్గుచేటు కాదా?. రూ.లక్ష కోట్ల విలువైన పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. దేశానికి నిర్దిష్ట లక్ష్యం లేకుండా పోయింది. ఈదేశంలో అందుబాటులో ఉన్న విద్యుత్ 4.10లక్షల మెగావాట్లు. దేశం ఎప్పుడూ కూడా 2.10లక్షల కోట్ల మెగావాట్లు మించి వాడలేదు. రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలి. వీటన్నింటిని రూపుమాపేందుకే బీఆర్ఎస్ ఆవిర్భవించింది.
దేశ దుస్థితికి కాంగ్రెస్, బీజేపీనే కారణం. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీని తిడుతుంది. బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను తిడుతుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్‌ను తయారు చేస్తాం. దేశంలో రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందే. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్ ఇస్తాం. రైతు బంధు స్కీమ్ దేశమంతా అమలు చేయాలన్నదే బీఆర్ఎస్ విధానం. ఎన్‌పీఏల పేరుతో రూ.14లక్షల కోట్లు దోచి పెట్టారు’’ అని సీఎం కేసీఆర్ ఆరోపించారు.
ఖమ్మం సభలో జిల్లా వాసులకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. ‘‘ జిల్లాలోని మొత్తం 589 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున, జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.30కోట్ల చొప్పున, ఖమ్మం మున్సిపాలిటికీ రూ.50కోట్లు మంజూరు చేస్తున్నా. 10వేల జనాభా దాటిన మేజర్ పంచాయతీలకు రూ.10కోట్ల నిధులు కేటాయిస్తున్నాం. మున్నేరు నదిపై వంతెన మంజూరు. జర్నలిస్టులకు ఖమ్మం జిల్లా కేంద్రంలో నెలలోగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఖమ్మం జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తున్నాం. ప్రభుత్వ స్థలం దొరక్కపోతే సేకరించైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరుతున్నా’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా నేర్చుకున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మేం ఒకరి నుంచి మరొకరం నేర్చుకుంటాం. ఢిల్లీ మొహల్లా క్లినిక్ మంచి ఫలితాన్నిస్తోంది. వాటిని చూసే సీఎం కేసీఆర్ ఇక్కడ బస్తీ ఆస్పత్రులుగా అమలు చేశారు. మొహల్లా క్లినిక్‌ల పరిశీలనకు కేసీఆర్ ఢిల్లీ గల్లీలో తిరిగారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఢిల్లీ పాఠశాలలు పరిశీలించారు. తమిళనాడులోనూ పాఠశాలలు బాగు చేసుకున్నారు. ఢిల్లీలో ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు కూడా ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. కేరళలో విద్య, వైద్యం బాగుంటుందని చిన్నప్పటి నుంచి విన్నా. అలాంటి పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు లేదు..? బీజేపీ నియమించిన గవర్నర్లంతా రాజకీయం చేస్తున్నారు. సీఎంలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
గవర్నర్లను మోదీనే ఆడిస్తున్నారు. గవర్నర్లకు ఢిల్లీ నుంచి ఒత్తిడి ఉంది. తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. అభివృద్ధి పనులకు అడ్డుతగలడమే గవర్నర్ల పని అన్నట్లుగా ఉంది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశం వెనుకబడే ఉంది. మన తర్వాత స్వాతంత్య్రం పొందిన సింగపూర్ దూసుకెళ్తోంది. మనమేం పాపం చేసుకున్నామని వెనుకబడిపోతున్నాం. మన దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో ఉంది. 2024 ఎన్నికల్లో దేశమంతా కలిసి బీజేపీని తరిమికొట్టాలి’ అని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
భారతదేశం హిందూ దేశంగా మారితే ప్రమాదకరమని రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు దేశ మౌలిక వ్యవస్థలనే మార్చేయాలని చూస్తున్నారు. సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ అన్న మోదీ.. ఇప్పుడు ఎవరితో ఉన్నారు?. మోదీ పేదవాళ్లను వదిలేసి.. కార్పొరేటర్లతో తిరుగుతున్నారు. అలాగే.. గవర్నర్లు.. సీఎంలను ఇబ్బంది పెడుతున్నారు. ఇదేనా ఫెడరల్ స్ఫూర్తి అంటే అని కేంద్రానికి ఏకిపడేశారు. చివరికి.. వన్ నేషన్.. వన్ లీడర్.. వన్ పార్టీ అనే రీతిలో వ్యవహరిస్తోంది బీజేపీ. దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందన్న రాజా.. బీజేపీ దేశానికి ప్రమాదకారిగా పరిణమించిందని డి. రాజా పేర్కొన్నారు.
మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్
దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయం. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకండా పోరాడాలి. బీజేపీ కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తోంది. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన ఉంటోంది. కేసీఆర్ ఆధ్వర్యంలో అధికార వీకేంద్రీకరణ జరుగుతోంది. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఇవాళ్టితో ఇంకా 399 రోజులే మిగిలి ఉన్నాయి.కేంద్రానికి కౌంట్ డౌన్ మొదలైంది. రైతుల్ని ఆదుకుంటామన్నారు.. మాట తప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామన్నారు.. చేతులెత్తేశారు. తెలంగాణలో మాదిరే యూపీలోనూ బీజేపీ ప్రక్షాళన జరుగుతుందని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.
కేరళ సీఎం పినరయి విజయన్
దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయం. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకండా పోరాడాలి. బీజేపీ కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తోంది. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన ఉంటోంది. కులాలు, మతాల వారీగా ప్రజలను వేరు చేయడాన్ని వ్యతిరేకించాలి. కేసీఆర్ ఆధ్వర్యంలో అధికార వీకేంద్రీకరణ జరుగుతోంది. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. కేసీఆర్ పోరాటానికి మా మద్దతు ఉంటుంది అని కేరళ సీఎం ప్రకటించారు.