
Hyd, Jan 17: హైదరాబాద్ నగరంలో పాస్‌పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్ల కోసం (Appointments for Passport) ఎక్కువ కాలం నిరీక్షించకుండా సాధారణ, తత్కాల్ అపాయింట్‌మెంట్‌లను మరిన్ని పెంచినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బేగంపేట ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో సాధారణ పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్‌లు (regular and Tatkal appointments) 50, తత్కాల్ 50, అమీర్‌పేట పీఎస్‌కేలో సాధారణ 25, తత్కాల్ 25, టోలిచౌకి పిఎస్‌కెలో సాధారణ 25, తత్కాల్ 25, నిజామాబాద్ తత్కాల్ 20 అపాయింట్‌మెంట్‌లను పెంచినట్లు ఆయన తెలిపారు.
పెంచిన అపాయింట్‌మెంట్‌లు 16వ తేది నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. గత డిసెంబర్ మాసంలో 5 ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్టు సేవా క్రేందాల్లో వరుసగా 4 శనివారాల్లో ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా అపాయింట్‌మెంట్‌ల లభ్యత పెంచినట్లు వివరించారు. దీనివలన గతంలో తత్కాల్ అపాయింట్‌మెంట్‌ల లభ్యత సమయం 30 రోజులకు, సాధారణ పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్‌ల లభ్యత సమయం 40 రోజులకు తగ్గిందని ఆయన తెలిపారు.