Kavitha Letter To CBI: విచారణకు రాలేను! సీబీఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత, ఎన్నికల షెడ్యూల్ లో బిజీగా ఉన్నానంటూ సమాధానం
ఈ మేరకు ఆమె ఆదివారం సీబీఐకి (Letter To CBI) లేఖ రాశారు. ఒకవేళ నా నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరయ్యేందుకు అందుబాటులో ఉంటానన్నారు
Hyderabad, FEB 25: సీఆర్పీసీ సెక్షన్ 41 కింద జారీ చేసిన నోటీసులు రద్దయినా చేయాలని లేదంటే ఉపసంహరించుకోవాలని సీబీఐని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) కోరారు. ఈ మేరకు ఆమె ఆదివారం సీబీఐకి (Letter To CBI) లేఖ రాశారు. ఒకవేళ నా నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరయ్యేందుకు అందుబాటులో ఉంటానన్నారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదన్నారు. 2022 డిసెంబర్‌లో అప్పటి ఐవో ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారన్నారు. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదన్నారు. నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తున్నదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావునిస్తోందన్న కవిత(BRS MLC Kavitha).. నాకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని పేర్కొన్నారు.
ఇది నా ప్రజాస్వామిక, రాజ్యంగ హక్కులకు భంగం కలిగిస్తుందన్నారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదని.. పైగా కేసుకోర్టులో పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. ఈడీ నోటీసులు జారీ చేయగా తాను సుప్రీం కోర్టును ఆశ్రయించానని తెలిపారు. ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారని ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుందని.. గతంలోనూ సీబీఐ (CBI) బృందం హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించానని తెలిపారు. నియమ నిబంధనలను కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సీబీఐ దర్యాప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తానన్నారు.
కానీ, 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు పిలవడం, సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తుందంటూ అనుమానం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించిందని.. రానున్న ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటానన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేతకు పరిశీలించాలని కోరారు.