BRS Protests For Runamafi: రుణమాఫీపై బీఆర్ఎస్ పోరు, యాదాద్రి నుండి హరీశ్ రావు ఆలయాల యాత్ర, 119 నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు

తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేయనుంది. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నేతలకు ఇవాళ్టి కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు కేటీఆర్. ఏ నియోజకవర్గాల్లో ఎవరి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారో కార్యకర్తలకు వివరించారు.

BRS Protests For Runa Mafi Today, Harishrao to visit Yadadri Temple(X)

Hyd, Aug 22:  వందశాతం రుణమాఫీ అమలు చేయాలని ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట పట్టనుంది బీఆర్ఎస్. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేయనుంది. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నేతలకు ఇవాళ్టి కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు కేటీఆర్. ఏ నియోజకవర్గాల్లో ఎవరి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారో కార్యకర్తలకు వివరించారు. ఇక వివిధ ఆలయాల్లో ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీపై ప్రమాణం చేసి మాట తప్పారని ఆరోపించిన హరీశ్ రావు ఇవాళ్టి నుండి ఆలయాల యాత్ర చేపట్టనున్నారు.

ఆగస్టు15 లోగా రైతులందరికి రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారని ఆరోపించారు హరీశ్ రావు.

49 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయని డిసెంబర్ నెలలో చెప్పారు..కడుపు కట్టుకుంటే చాలు ఒక్క ఏడాదిలో 40వేల కోట్ల రుణమాఫీ చేస్తానని జనవరిలో అన్నారు కానీ ఇప్పుడు మాటతప్పి సగం మందికే రుణమాఫీ చేశారన్నారు.

రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెబుతుంటే మరోవైపు మంత్రులు కాలేదు అంటున్నారు...ఇందులో ఎవరి మాట నిజమో తెలియక, రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అన్నారు. దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసేందుకు ఆలేరులో నిర్వహించే ధర్నాలో పాల్గొంటాను అని చెప్పారు హరీశ్‌. నాకు ఎలాంటి ఫామ్‌హౌస్ లేదు, హైడ్రా పేరుతో బీఆర్ఎస్‌ నేతలపై బెదిరింపులు, కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాలను కూల్చరా?

ఇప్పటికే రైతులు రుణమాఫీపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టి నిరసన చేపడుతుండగా ఇవాళ బీఆర్ఎస్ చేపట్టబోయే ధర్నాల్లో రైతులు స్వచ్ఛందంగా తరలివస్తారని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.