KTR Counter On Formula E Car Racing: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ కౌంటర్, ప్రభుత్వ వాదన అర్ధరహితమంటూ కౌంటర్
సర్కార్ మోపిన అబద్ధాలను తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
Hyderabad, DEC 28: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో (Formula E Car Racing) కాంగ్రెస్ ప్రభుత్వం తనపై చేస్తున్నది ఉద్దేశపూర్వక, నిరాధారమైన నిందారోపణలే తప్ప నిజాలు ఎంత మాత్రం లేవని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలిపారు. సర్కార్ మోపిన అబద్ధాలను తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై ఆయన కౌంటర్ దాఖలు దాఖలు చేశారు. ఆ కౌంటర్‌లో అనేక విషయాలను వెల్లడించారు. ఫార్ములా ఈ- కార్ రేసు విషయంలో కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆ కౌంటర్‌లో కేటీఆర్ బదులిచ్చారు. ఫార్ములా ఈ-రేస్ సీజన్ 10 నిర్వహణను స్పాన్సర్ లేకపోవడం వల్లే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో కుట్ర లేదని.. అవినీతి అంతా కన్నా లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచడం కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమే అని తెలిపారు. ఫార్ములా ఈ-రేస్ మరో సీజన్‌ను కూడా హైదరాబాద్‌లో నిర్వహించడానికి తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం మాత్రమే పేర్కొన్నారు.
ఫార్ములా ఈ-రేస్‌కు (Formula E Car Racing) సంబంధించి ప్రభుత్వం చేస్తున్న వాదన అర్థరహితమని కేటీఆర్ (KTR) అన్నారు. ఎన్నికలున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్త నియమావళిని అతిక్రమించారని చేస్తున్న ప్రభుత్వ వాదనను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరిగితే ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇవ్వాలి. అది ఇప్పటి వరకు జరగలేదు. ఎలక్షన్ కమిషన్ తరుపున మీరు ఎందుకు వకాల్తా పుచ్చుకున్నారు? అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ-రేస్ వల్ల రాష్ట్రానికి రూ.700 కోట్ల ప్రయోజనం చేకూరిందని నీల్సన్ రిపోర్ట్ పేర్కొన్న విషయాన్ని ఆయన ఉదహరించారు. ఫార్ములా ఈ-రేస్ చేజారిపోకూడదని రూ.54 కోట్ల చెల్లింపులను గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన శాఖ జరిపిందన్నారు. చెల్లింపులు అక్రమం కాదని స్పష్టం చేశారు. అయితే, రూ.54 కోట్లు కాస్త 600 కోట్లు ఎట్లా అయ్యాయి? ఆ లెక్క ఇప్పటివరకు తమకు కనిపించలేదని అన్నారురు. అది పూర్తిగా నిరాధారమైన ఆరోపణ అని తేల్చిచెప్పారు. ఫార్ములా ఈ-రేస్‌లో మొత్తం రూ. 600 కోట్ల అవినీతి జరిగిందని ఊకదంపుడుగా, ఉద్దేశపూర్వకంగా ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 600 కోట్ల అవినీతి అని తన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెచ్‌ఎండీఏ (HMDA) అధికారాలకు లోబడే రూ. 54 కోట్లు చెల్లింపులు ఫార్ములా ఈ సంస్థకు బదిలీ జరిగిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం చెప్పే రూ. 8 కోట్లు టాక్స్ రిటర్న్స్ మాత్రమే అని.. స్పాన్సర్ ఆ పన్నును భర్తీ చేస్తారని తెలిపారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా జరిగిన చెల్లింపులు అన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని అన్నారు. ‘రూ. 54 కోట్లు ఫార్ములా ఈ నిర్వహకులకు ఇచ్చినప్పుడు, ఒకవేళ మీరన్నట్టు అవినీతి జరిగితే మరి ఫార్ములా ఈ సంస్థ మీద కేసు ఎందుకు వేయలేదు? ఇప్పటివరకు నాకు రూపాయి కూడా ముట్టినట్టు మీరు చూపించలేకపోయారు. ఇవి కక్షపూరిత ఆరోపణలే కానీ నేరం జరిగిందని చెప్పే రుజువులు కాదు. ఫార్ములా ఈ వల్ల ఒకవేళ నష్టం జరిగితే అది కేవలం రేవంత్‌రెడ్డి అర్థరహిత నిర్ణయాలు, ఆలోచన లేని పనుల వల్ల మాత్రమే జరిగింది’ అని కేటీఆర్ దాఖలు చేసిన కౌంటర్‌లో స్పష్టం చేశారు.