KTR Letter To Nirmala Sitharaman: తెలంగాణ అప్పులపై నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్, రాష్ట్రం ఎప్పటికీ మిగులు రాష్ట్రమే అంటూ లేఖ
స్వాతంత్రం వచ్చిన నాటినుంచి 14 మంది ప్రధానులు 65 ఏళ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 2014 నుంచి 2024 వరకు కేవలం పదేళ్లలోనే రూ.125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై (Telangana Debits) మాట్లాడే నైతిక హక్కే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Hyderabad, FEB 16: స్వాతంత్రం వచ్చిన నాటినుంచి 14 మంది ప్రధానులు 65 ఏళ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 2014 నుంచి 2024 వరకు కేవలం పదేళ్లలోనే రూ.125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై (Telangana Debits) మాట్లాడే నైతిక హక్కే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపిన నాడు కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని కేటీఆర్ స్పష్టంచేశారు. 2014లో తెలంగాణ ఏర్పడిన సమయంలోనూ రాష్ట్రానికి దాదాపు 70 వేల కోట్ల వరకు అప్పు ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే బీఆర్ఎస్ పదేళ్ల పాలన తరువాత కూడా తెలంగాణను మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే కాంగ్రెస్‌కు అప్పజెప్పామని కేటీఆర్ తేల్చిచెప్పారు. అసలు అప్పులను, మిగులు బడ్జెట్‌తో ముడిపెట్టడం సమంజసం కాదన్నారు.
గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుగా తెచ్చిన ప్రతి పైసాను పెట్టుబడిగా మార్చి తెలంగాణ నేలపై విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిన విషయాన్ని యావత్ దేశం చూసిందని కేటీఆర్ గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో తీవ్ర విధ్వంసానికి గురైన తెలంగాణ ముఖచిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా మార్చి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. అప్పులున్నంత మాత్రాన ఒక రాష్ట్రం వెనకబడినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం సరైంది కాదని స్పష్టంచేశారు. తెచ్చిన అప్పులను దేనికోసం ఖర్చుపెట్టారనేదే అత్యంత కీలకమైన విషయమని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదేళ్లలో తెచ్చిన 125 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పే పరిస్థితి లేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పుతో దశాబ్దాలపాటు ఈ నేలను పట్టి పీడించిన తాగు, సాగునీటి కష్టాలను శాశ్వతంగా నిర్మూలించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిర్మించామని పేర్కొన్నారు.
వ్యవసాయంతోపాటు పారిశ్రామికరంగాన్ని వెంటాడిన చిమ్మచీకట్లను శాశ్వతంగా పారదోలేందుకు భారీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి, మరోవైపు రాష్ట్రంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను ఉపయోగించిన విషయం తెలంగాణ సమాజానికి తెలుసని, వాటి ఫలితాలను రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు.
బీఆర్ఎస్ హయాంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడి చేసిన అప్పును తప్పుగా చూపించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం లాగా తెచ్చిన అప్పులతో కార్పొరేట్ శక్తుల లక్షల కోట్ల లోన్లు మాఫీ చేయలేదనే విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తుపెట్టుకోవాలని కోరారు. పంటల దిగుబడిలో పంజాబ్‌నే తలదన్నే స్థాయికి తెలంగాణ ఎదిగిందంటే దానికి ప్రధాన కారణం.. తెచ్చిన అప్పులతో సంపద సృష్టించే బృహత్తర కార్యక్రమాలు చేపట్టడమేనని కుండబద్దలు కొట్టారు. అటు కేంద్ర బడ్జెట్ లో, ఇటు రైల్వే కేటాయింపుల్లో బీజేపీ సవతి ప్రేమ కనబరుస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. అధికారంలోకి రాగానే తెలంగాణలోని ఏడు మండలాలను, లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును లాక్కొని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం గొంతుకోసిన విషయాన్ని పదేళ్లు గడిచినా తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం ఖజానా నింపే తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాను ఇవ్వాలని, విభజన హక్కులను నెరవేర్చాలని అడిగిన పాపానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో.. కేంద్ర ప్రభుత్వ ఖజానా నింపే స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దినందుకు తెలంగాణకు మీరిచ్చే బహుమానం ఈ అవమానాలేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌లో పసుపు బోర్డుకు ఒక్క పైసా కూడా కేటాయించకుండా, కేవలం మాటలకే పరిమితం కావడం అత్యంత దారుణని మండిపడ్డారు. బోర్డు చైర్మన్ కు కనీసం కూర్చోవడానికి కార్యాలయం కూడా ఇవ్వకపోవడం, పసుపు బోర్డు పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని స్పష్టంచేశారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని పదేళ్లలో పదులసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం వినిపించుకోలేదన్నారు . దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్ లో ఇచ్చిన హామీలకు దశాబ్దం గడిచినా మోక్షం లేకపోవడం నయవంచన కాదా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం సొంత ఖర్చులతో చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా వంద శాతం ఇళ్లకు మంచి నీళ్లిచ్చే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దితే, దాన్ని కూడా జల్ జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చామని కేంద్రం ఖాతాలో వేసుకోవడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరిపించి యువతకు ఉపాధి కల్పించాలని పదేపదే విజ్ఞప్తి చేసినా కేంద్రం వినిపించుకోకపోవడం ఆ ప్రాంత ప్రజల పట్ల బీజేపీకి ఉన్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)