Statue Of Equality 6th Day: ఆరోరోజు అత్యంత వైభవంగా శ్రీభగవద్రామానుజుల సహస్రాబ్ది సమారోహం, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ హాజరు
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్‌జీ, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహాన్ని దర్శించుకున్నారు.
ముచ్చింతల్, ఫిబ్రవరి 10 : శ్రీభగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆరోరోజు శ్రీరామనగరం భక్తజన సంద్రమైంది. జయ జయ రామానుజ అంటూ జయజయ ద్వానాలు చేస్తూ.. జై శ్రీరామ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు భక్తులు. 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకుని తన్మయత్వంతో మైమరిచిపోయారు. నేడు యాగశాలలో దృష్టిదోషాల నివారణకు వైయ్యూహికేష్టి యాగాన్ని నిర్వహించారు. 5వేల మంది రుత్విజులు వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా లక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. 114 యాగశాలల్లో 1035 హోమ కుండాల్లో రుత్విజుల చతుర్వేద పారాయణల మధ్య ఘనంగా జరిగింది. అనంతరం ప్రవచన మండపంలో వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మజీవనానికి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ జరిగింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తులకు శ్రీకృష్ణపెరుమాళ్ డాలర్ ను ఇచ్చి పూజలను జరిపించారు.
అనంతరం 108 దివ్యదేశాల్లోని 33 దివ్యదేశ ఆలయాలకు ప్రాణప్రతిష్ఠ శాస్త్రోత్తంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామీజీ యాగశాల నుంచి రుత్విజులతో కలిసి సామూహిక వేద పారాయణం చేస్తూ.. సమతామూర్తి ప్రాంగణంలో ఉన్న దివ్యదేశ ఆలయాలలోని ౩2 ప్రధాన ఆలయాలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమంలో వేదపండితులతో పాటు మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు.
సమతా క్షేత్రానికి వీవీఐపీలు తరలివస్తున్నారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్‌జీ, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్‌జీ, కేంద్ర మాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆలయ విశేషాలను, సమతామూర్తి ప్రాంగణ విశిష్టతను వివరించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. అనంతరం డిజిటల్ గైడ్, త్రీ డీ లేజర్ షో ద్వారా రామానుజుల జీవితచరిత్రను తెలుసుకున్నారు. సమతామూర్తి ప్రాంగణంలో మొక్కలు నాటారు.
భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి అనుమతి
యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో పాల్గొన్నారు కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్‌జీ, కేంద్రమాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ప్రధాన యాగశాలలో పెరుమాళ్‌కు పూజలు చేశారు. రాజ్‌నాథ్ సింగ్‌కు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీజీ మంగళాశాసనాలు అందించారు. అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, శ్రీశ్రీ రవిశంకర్‌జీకి రామానుజాచార్యుల ప్రతిమలను బహూకరించి సత్కరించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్:
ప్రవచన మండపంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భగవద్రామానుజాచార్యుల చరిత్రను చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. రామానుజాచార్యుల సమతా సిద్ధాంతాన్ని వివరించారు. 216 అడుగుల విగ్రహం రామానుజాచార్యుల మరో అవతారంగా భావిస్తున్నామన్నారు రాజ్‌నాథ్ సింగ్. రామానుజాచార్యుల విగ్రహ ఏర్పాటుతో యుగయుగాలకు రామానుజాచార్యుల సందేశం అందుతుందన్నారు. రామానుజాచార్యుల విశాల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావును అభినందించారు. రామానుజాచార్యుల శిష్యుల్లో అన్నికులాలకు చెందినవారున్నారన్నారు రాజ్‌నాథ్. తనకు గురువు చెప్పిన ముక్తిమంత్రాన్ని గుప్తంగా పెట్టకుండా అందరి ముందూ ఆలపించారన్నారు. తాను నరకానికి వెళ్లినా ఫర్వాలేదని.. వేలాది మందికి ముక్తి లభిస్తే చాలని చెప్పిన మహనీయుడు రామానుజాచార్యులన్నారు రాజ్‌నాథ్. లోకకళ్యాణం కోసం హిందువుల ఐక్యత కోసం రామానుజాచార్యులు ఎంతో కృషి చేశారన్నారు. భగవద్రామానుజులు వైష్ణ వ సంప్రదాయాలను అన్నివర్గాల ప్రజలకు చేరువ చేశారన్నారు. కులాల గోడలు బద్దలు కొట్టి అసమానతలను రూపుమాపేందుకు రామానుజాచార్యులు కృషి చేశారన్నారు. భక్తిలో సమానత్వాన్ని చాటిచెప్పారన్నారు. ప్రపంచమంతా రామానుజాచార్యుల ఉపదేశాన్ని వ్యాప్తి చేయాలన్నారు రాజ్‌నాథ్ సింగ్.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్:
ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మద్వాచార్యులు భారత సనాతన ధర్మాన్ని కాపాడేందుకు విశేష కృషి చేశారన్నారన్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్‌జీ. భారత విద్యార్థులకు ఆధునిక విద్యతోపాటు ఆధ్యాత్మికతను జోడించి బోధించాల్సిన అవసరముందున్నారు. 108 దివ్యదేశాలను ఒకేచోట ప్రతిష్టించడం గొప్ప విషయమన్నారు. వెయ్యేళ్ల క్రితమే సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు రామానుజాచార్యులు కృషి చేశారన్నారు శ్రీశ్రీ రవిశంకర్. వెయ్యేళ్ల క్రితమే అన్నిజాతుల ప్రజలను ఆలయ ప్రవేశం చేయించిన సమతామూర్తి సంకల్పం మహోన్నతమైనదన్నారు. రామానుజాచార్యుల విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ రామేశ్వరరావును అభినందించారు శ్రీశ్రీ రవిశంకర్‌జీ.
ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్:
రామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహ ఏర్పాటుతో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీజీ స్వప్నం సాకారమైందన్నారు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ . దేవుడి ముందు అందరూ సమానమేనని రామానుజాచార్యులు వెయ్యేళ్లక్రితమే చెప్పారన్నారు. సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు రామానుజాచార్యులు విశేష కృషి చేశారన్నారు. రామానుజాచార్యులను ఆదర్శంగా తీసుకుని.. పాలకులు ప్రజందరికీ సమన్యాయం చేయాల్సిన అవసరముందన్నారు గవర్నర్.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ:
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడం శభపరిణామమన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీజీ. ప్రధాని మోదీ కాశీలో మహదేవుడి ఆలయ పునరుద్ధరించడం, అయోధ్యలో రామ మందిరం పునర్ నిర్మిస్తుండటం ద్వారా హిందూ ధర్మం పట్ల తమకు ఉన్న నిబద్ధతను చాటుకున్నారన్నారు . దేశం గర్వపడేలా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ. రాజ్‌నాథ్ మార్గనిర్దేశంలో భారత ఆర్మీ మరింత శక్తివంతంగా తయారైందన్నారు.