Telangana RTC Strike: ముగిసిన డెడ్‌లైన్, సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్, విధుల్లో చేరని వారిపై ఇక కఠిన నిర్ణయమే, ఆర్టీసీ భవితవ్యంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం

ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ కూడా దాటిపోవడంతో ఇక ఏమైనా జరగనీ అనే రీతిలో కార్మికులు ఉదృతంగా సమ్మెను సాగిస్తున్నారు. వారు తమ పూర్తి ఆశలను హైకోర్టుపైనే....

TSRTC Strike | CM KCR Review | File Photo

Hyderabad, November 6:  సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు (TSRTC Employees) బేషరతుగా విధుల్లో చేరాలని ఇచ్చిన గడువు నిన్న అర్ధరాత్రితో పూర్తయింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ (CM KCR), రవాణామంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఇక అవకాశం ఇచ్చినా, ఆశించిన స్థాయిలో కార్మికులెవ్వరూ ఉద్యోగాల్లో చేరకపోవడంతో వారిపై సీఎం కఠిన నిర్ణయాలే తీసుకోనునట్లు తెలుస్తుంది. ఆర్టీసీ భవితవ్యంపై ఇక ముందు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చిస్తున్నారు. అలాగే రేపు హైకోర్టు (High Court of Telangana) లో ఆర్టీసీ సమ్మె అంశం మరోసారి చర్చకు రానుండటంతో కోర్టు ముందు ఉంచాల్సిన అంశాలు, తదితర విషయాలపై సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

సీఎం విధించిన గడువును బేఖాతర్ చేసిన ఆర్టీసీ కార్మికులు, 33వ రోజుకు చేరిన సమ్మె

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఉండదని ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేసిన కేసీఆర్, కార్మికులు గడువులోపు ఉద్యోగాల్లో చేరకుంటే ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సులను సైతం ప్రైవేట్ వాళ్ళకే అప్పజెప్తాం అని కార్మికులకు అల్టిమేటమ్ జారీచేశారు. అయినప్పటికీ కార్మికులెవరూ సీఎం వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోలేదు. 49 వేలలో మంగళవారం నాటికి కేవలం 360 మంది మాత్రమే విధుల్లో చేరుతున్నామని లేఖ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో దాదాపు 200 మంది బస్ భవన్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బందే ఉన్నట్లు చెప్తున్నారు. విధుల్లో చేరేందుకు సిద్ధమైన డ్రైవర్లు, కండక్టర్ల సంఖ్య అతి స్వల్పంగా ఉంది. అయితే వారినింకా డ్యూటీలోకి తీసుకోలేదు. ఎన్ని డెడ్‌లైన్‌లు పెట్టినా విధుల్లోకి చేరేది లేదు. డిమాండ్లపై చర్చించాల్సిందే!

రేపు హైకోర్ట్ నిర్ణయం వెలువడిన తర్వాత, కార్మికుల భవితవ్యంపై ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సాయంత్రం ఆర్టీసీపై ప్రభుత్వం నుంచి ఏదైనా కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇక బుధవారంతో ఆర్టీసీ సమ్మె 33వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ కూడా దాటిపోవడంతో ఇక ఏమైనా జరగనీ అనే రీతిలో కార్మికులు ఉదృతంగా సమ్మెను సాగిస్తున్నారు. వారు తమ పూర్తి ఆశలను హైకోర్టుపైనే పెట్టుకున్నారు. ఈరోజు సమ్మెలో భాగంగా ప్రతిపక్ష పార్టీలతో కలిసి డిపోల ఎదుట నిరహారా దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుండటంతో పోలీసులు వారిని నిలువరిస్తున్నారు. దీంతో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.