CM Revanth Reddy: తెలంగాణ నీటి వాటాలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ అనుమతులు తీసుకోవాలని సూచన
రాష్ట్ర ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన రికార్డులు, ఉత్తర్వులు, అవసరమైన సాక్ష్యాధారాలన్నీ సిద్ధంగా ఉంచాలని నీటి పారుదల శాఖ అధికారులను, న్యాయ నిపుణులను అప్రమత్తం చేశారు.
Hyd, Dec 1: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన రికార్డులు, ఉత్తర్వులు, అవసరమైన సాక్ష్యాధారాలన్నీ సిద్ధంగా ఉంచాలని నీటి పారుదల శాఖ అధికారులను, న్యాయ నిపుణులను అప్రమత్తం చేశారు.
రాష్ట్రంలో సాగునీటి పరిస్థితి, కృష్ణా గోదావరి జలాలపై ఉన్న అంతరాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించి పలు సూచనలు చేశారు. రాష్ట్ర పునర్వవ్యస్తీకరణ చట్టం ప్రకారం ఆంధ్ర, తెలంగాణల మధ్య నీటి వాటాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై త్వరలోనే బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రాలు తమ వాదనలు వినిపించడానికి అవసరమైన సమగ్ర వివరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
కృష్ణా నదీ పరివాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం. ఏపీలో కేవలం 30 శాతం ఉంది. అదే నిష్పత్తి ప్రకారం 1005 టీఎంసీల్లో 70 శాతం నీటి వాటా తెలంగాణకు దక్కేలా వాదనలు వినిపించాలన్నారు సీఎం. పోలవరం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు వినియోగిస్తున్నందున, బదులుగా నాగార్జునసాగర్ ఎగువన 45 టీఎంసీలు తెలంగాణకు నీటి కేటాయింపులున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆ నీటి వాటాను ఎగువన ఉన్న ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకునే ప్రణాళికను అమలు చేయాలన్నారు.
ట్రిబ్యునల్ నీటి వాటాల పంపిణీ పూర్తి చేసేంతవరకు #KRMB, #GRMB బోర్డుల జోక్యం ఉండకూడదని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలన్నారు. వివిధ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ కోటాకు మించి ఎక్కువ నీటిని తరలిస్తుందన్న విషయంలో నీటి ప్రవాహాన్ని శాస్త్రీయంగా లెక్కించడానికి టెలీమెట్రీ విధానం ద్వారా మానిటర్ చేయాలన్నారు. నీటి వినియోగంలో అన్యాయం జరక్కుండా కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులన్నింటి ద్వారా ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వినియోగిస్తుందన్న లెక్కలు తీయాలన్నారు. పాలమూరును అభివృద్ధి చేయకపోతే చరిత్ర క్షమించదు, రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ.. , రైతు సంక్షేమంపై చర్చకు రావాలని కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్
శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, బంకంచెర్ల హెడ్ రెగ్యులేటరీ, తెలుగు గంగ, కేసీ కెనాల్, హంద్రీ నివా, గాలేరు నగరి, వెలుగోడు ప్రాజెక్టుల నుంచి ఎంత నీటిని తరలిస్తున్నారనే వివరాలన్నీ రికార్డు చేయాలని...సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీకి అవసరమైన అనుమతులు తీసుకోవాలి. పూర్తి ఆయకట్టుకు నీరందించేందుకు అవసరమైన పనులన్నీ తొందరగా చేపట్టాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు, నీటి వాటాలకు సంబంధించి అన్ని వేదికలపైనా సమర్థంగా వాదనలు వినిపించేందుకు 2014 నుంచి ఇప్పటివరకు జారీ అయిన జీవోలు, తీర్పులే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఉత్తర్వులు, మెమోలు, ప్రాజెక్టుల డీపీఆర్‌లు, అప్పటి నుంచి నీటి వాటాల్లో రాష్ట్రానికి జరిగిన నష్టాలపై సమగ్రంగా నివేదిక తయారు చేయాలని సూచించారు.