CM Revanth Reddy: మాగనూరు స్కూల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశం..ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులపై ఫైర్
బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు.
Hyd, Nov 21: నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థినీ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు.
ఈ సంఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి గారు అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనకు దారి తీసిన కారణాలపై వెంటనే విచారణ జరిపి, తనకు నివేదికను అందజేయాలని సీఎంవో అధికారులను సీఎం ఆదేశించారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గురుకులాలా లేక నరక కూపాలా? రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం
గురుకులాల్లో వరుస విద్యార్థినులపై ఫుడ్ పాయిజన్, పాము కాట్లు ఆందోళన రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం చేశారు. గురుకులాలా లేక నరక కూపాలా ..ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా అని ప్రశ్నించారు. వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్యం పాలై ఓ విద్యార్థిని 20 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై కొట్టుమిట్టాడుతున్నదని హరీశ్‌రావు తెలిపారు.
అలాగే నల్లగొండ జిల్లాలో పాముకాటుకు గురైన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. ఇప్పుడు నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. రాష్ట్రంలోని గురుకులల్లో, ప్రభుత్వ పాఠశాలలో అసలు ఏం జరుగుతున్నదని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్య పూరిత వైఖరికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలని నిలదీశారు.