Congress Warangal Declaration: టీఆర్ఎస్‌తో పొత్తు కావాలనుకునేవాళ్లు బయటకు వెళ్లండి! ప్రజల్లో లేకపోతే ఎంత సీనియర్ అయినా టికెట్ ఇవ్వం, కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్, వరంగల్ డిక్లరేషన్‌లో పలు కీలక హామీలు

ఎంతో మంది యువత, తల్లుల రక్తం, కన్నీళ్లతో సాధించుకున్న రాష్ట్రం అని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అన్నారు. హన్మకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో (Raithu Sangarshana sabha) రాహుల్‌ గాంధీ మాట్లాడారు.

Warangal, May 06: తెలంగాణ (Telangana) ప్రత్యేక రాష్ట్రం సులువుగా ఏర్పాటైంది కాదని.. ఎంతో మంది యువత, తల్లుల రక్తం, కన్నీళ్లతో సాధించుకున్న రాష్ట్రం అని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అన్నారు. హన్మకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో (Raithu Sangarshana sabha) రాహుల్‌ గాంధీ మాట్లాడారు. రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. సభ ప్రధాన వేదికకు ఎదురుగా రెండు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. అంతకుముందు సభా వేదికకు చేరుకున్న రాహుల్‌.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘‘తెలంగాణలో టీఆర్ఎస్ (TRS) పరిపాలన గురించి కొన్ని విషయాలను ప్రజలను అడగాలని అనుకుంటున్నా. ఏ కలలను నెరవేర్చుకోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో.. వాటిని ఈ ప్రభుత్వం నెరవేర్చిందా? కేవలం ఒక కుటుంబానికే మేలు జరుగుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల పరిస్థితికి ఎవరు కారణం?తెలంగాణ సాధనలో ముందడుగు వేసిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi).. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. ఈ నిర్ణయం వల్ల కాంగ్రెస్‌ (Congress) పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ తెలంగాణ ప్రజల మేలు కోరుతూ సోనియా రాష్ట్రాన్ని ఇచ్చారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రజలు, రైతులు, కార్మిక ప్రభుత్వం వస్తుందని అనుకున్నాం. కానీ ఆ కల నెరవేరలేదు. ఇక్కడి ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయడం లేదు. ఒక రాజులా పరిపాలన సాగిస్తున్నారు. రాజు.. సీఎం.. ఈ ఇద్దరిలో చాలా వ్యత్యాసం ఉంది. సీఎం ప్రజల వ్యక్తిగా ప్రజాస్వామికంగా పరిపాలన చేస్తారు. రాజు అనే వాడు పరిపాలన వ్యవస్థ గురించి ఎలాంటి ఆలోచన చేయడు. సీఎం ప్రజల మాటలు విని పరిపాలన కొనసాగిస్తారు. కాని రాజు అనేవాడు సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలతో ప్రజలతో సంబంధం లేకుండా పాలిస్తారు’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.

‘‘తెలంగాణలో ఒక వ్యక్తి రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము మింగింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ప్రజలను మోసం చేసిన వారితో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. మోసపూరిత పార్టీలతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. పొత్తు గురించి కాంగ్రెస్‌లో ఎవరు మాట్లాడినా బహిష్కరిస్తాం. టీఆర్ఎస్, బీజేపీతో అనుబంధముండే వారు కాంగ్రెస్‌లో ఉండొద్దు. టీఆర్ఎస్, బీజేపీ (BJP) ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరింది. మోదీ ప్రభుత్వానికి తెరాస సహకరిస్తోంది. మోదీ 3 నల్ల చట్టాలను తీసుకొస్తే టీఆర్‌ఎస్ సహకరించింది. తెలంగాణలో సొంతంగా గెలవలేమని బీజేపీకి తెలుసు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీని ఓడిస్తాం. తెలంగాణ యువతను మోసం చేసిన వారిని గద్దె దించుతాం. కాంగ్రెస్‌ విధివిధానాలను విమర్శిస్తే ఊరుకునేది లేదు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు పిలిచినా వస్తాను. ప్రజల అభిమానం పొందినవారికే ఈసారి టికెట్లు ఇస్తాం. నిజమైన ప్రజాసేవ ఎవరు చేస్తున్నారో పార్టీ గమనిస్తోంది. ప్రజల మధ్య ఉండని వారికి ఈసారి టికెట్లు దక్కవు’’ అని రాహుల్‌ తేల్చి చెప్పారు.

రైతు సోదరులు ఆందోళన చెందవద్దు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తాం. మేం చెప్పేవి వట్టి మాటలు కాదు. తెలంగాణ రైతుల ప్రగతి కోసం మా మాటలు నిలబెట్టుకుంటాం. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. పలు కీలక అంశాలతో కూడిన వరంగల్ డిక్లరేషన్‌ను ఈ సభలో ప్రవేశపెట్టాం. ఇది కేవలం డిక్లరేషన్‌ కాదు.. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఇది రైతులకు ఇచ్చే గ్యారెంటీ. ఈ రాష్ట్రంలోని రైతులు అందరూ డిక్లరేషన్‌ చదవాలి. రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతగా తీసుకొచ్చిందే ఈ డిక్లరేషన్‌. రైతులు బలహీనపడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోలేదు. అలాంటి సందర్భంలో ఈ డిక్లరేషన్‌ రైతు సోదరులకు పునాదిగా మారుతుంది.