Coronavirus in Telangana: నీలోఫర్ ఆసుపత్రిలో 45 రోజుల పసిబిడ్డకు సోకిన కరోనావైరస్, క్వారైంటైన్‌లోకి వైద్య సిబ్బంది, ఈరోజు భేటీకానున్న రాష్ట్ర మంత్రివర్గం

ఏప్రిల్ 15, 16, 17 తేదీలలో షిఫ్టుల వారీగా పనిచేసిన 10 మంది వైద్య సిబ్బందిని క్వారైంటైన్ కు తరలించారు.....

COVID-19 in Telangana | (Photo Credits: IANS)

Hyderabad, April 19: తెలంగాణలో శనివారం కూడా కొత్తగా 43 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆదివారం ఉదయం నాటికి రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 809కు చేరింది. ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి.  శనివారం నమోదైన కేసుల్లో 31 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివే. జోగులాంబా గద్వాల్ జిల్లా నుంచి 7, సిరిసిల్ల మరియు రంగారెడ్డి జిల్లాల నుంచి 2 చొప్పున, నల్గొండ జిల్లాలో మరొక కేసు నమోదైంది.

దీని ప్రకారం ఆయా జిల్లాల్లో ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న కోవిడ్-19 కేసుల సంఖ్య జీహెచ్ఎంసీలో 317, రంగారెడ్డిలో 20, గద్వాల్ లో 26, నల్గొండలో 13, సిరిసిల్ల జిల్లాల్లో 03గా ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో ప్రస్తుతం 605 యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఇప్పటివరకు 186 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మరో 18 మంది చనిపోయారని తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.

Here's the update by HM:

మరోవైపు హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ పిల్లల దవాఖానాలో ఓ 45 రోజుల పసిబిడ్డకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆసుపత్రి వర్గాల్లో కలకలం రేగింది. ఏప్రిల్ 15, 16, 17 తేదీలలో షిఫ్టుల వారీగా పనిచేసిన 10 మంది వైద్య సిబ్బందిని క్వారైంటైన్ కు తరలించారు.   జ్వరం, దగ్గు, జలుబు మందులు కావాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి

నారాయణపేట జిల్లాలోని అభంగపూర్ గ్రామానికి చెందిన దంపతులకు 45 రోజుల క్రితం ఒక ఒక మగబిడ్డ పుట్టాడు. బిడ్డకు జ్వరం రావడంతో స్థానిక ఆసుపత్రులను సంప్రదిస్తూ చివరకు నీలోఫర్ ఆసుపత్రిలో చేర్చారు. చిన్నారికి కరోనావైరస్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు, వారితో కలిసిన వారందరినీ అధికారులు క్వారైంటైన్ కు తరలించే పనిలో ఉన్నారు.

ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో తెలంగాణ మంత్రివర్గం సమావేశం (Cabinet Meet) కానుంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. తదనంతరం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కేబినేట్ భేటీ యొక్క విశేషాలను ప్రజలతో పంచుకోనున్నారు.