COVID Task Force Review: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అదుపులోనే కరోనా, రాష్ట్రంలో సమృద్ధిగా ఔషధ నిల్వలు ఉన్నాయి, బ్లాక్ ఫంగస్ పైనా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది: మంత్రి కేటీఆర్
పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు.
Hyderabad, May 13: తెలంగాణలో కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉందని, వ్యాక్సినేషన్, లాక్ డౌన్ తదితర చర్యల వలన రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కోవిడ్ మరింత తగ్గుముఖం పడుతుందని రాష్ట్ర పురపాలక, ఐ.టి. పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కోవిడ్ టాస్క్ ఫోర్స్ తొలి సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాలను వెల్లడించారు.
క్షేత్రస్థాయిలో కోవిడ్ పరిస్థితి తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి అయింది. ఇప్పటి దాకా 2.1 లక్షల కిట్స్ పంపిణీ చేశాం. హోం ఇసోలేషన్ లో ఉండేవారి కోసం ప్రభుత్వం అందజేస్తున్న మందుల నిల్వలో ఎలాంటి కొరత లేదు. లక్షణాలు ఉన్న వారు ఈ మందులు వాడటం వలన ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం దాదాపు ఉండదు అని కేటీఆర్ అన్నారు.
• రాష్ట్రంలో బెడ్స్ భారీగా పెంచాము, అదేవిధంగా కోవిడ్ చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య భారీగా పెంచాము.
• రెమిడిసివిర్ లాంటి మందుల నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల ఇంజెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంజెక్షన్లు తయారుచేస్తున్న కంపెనీల నుంచి అదనపు సరఫరాకు సమన్వయము చేస్తాము.
• దీంతో పాటు ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ వినియోగం పైన వివరాలు తీసుకుంటున్నాము. వీటి వినియోగం పైన ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తాం
• వీటితో పాటు రోగులు సీరియస్ గా అరుదుగా, అత్యవసరంగా వాడుతున్న టోలిసిజుమాబ్ వంటి మందుల సరఫరా కూడా సరిపడేలా చూసుకోవాలని అధికారులకు సూచించాము.
• బ్లాక్ ఫంగస్ అంశంలో కూడా ప్రభుత్వం అలెర్ట్ గా ఉంది, దీని చికిత్సకు అవసరం అయిన మందులను ప్రభుత్వం సరఫరా చేస్తుంది.
• ఆక్సిజన్ సప్లై గురించి కూడా చర్చించాము, ప్రస్తుత అవసరాల మేరకు డిమాండ్- సప్లై పైన వివరాలు తీసుకుంటున్నాము. ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి ఆక్సిజన్ ఆడిట్ ప్రభుత్వం చేస్తుంది.
• కోవిడ్ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నంబర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాము.
Watch Video:
వ్యాక్సినేషన్ ప్రక్రియ:
రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన జనాభా 92 లక్షలుగా ఉంది. ఇందులో ఇప్పటికే 38 లక్షల మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారు. వీరిలో 7.15 లక్షల మందితో పాటు 3 లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇప్పటికే రెండు డోసులు తీసుకున్నారు. మొత్తంగా 10 లక్షలకు పైగా జనాభా పూర్తి వాక్సిన్ తీసుకున్నారు.
ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. త్వరలోనే కరోనాకి చికిత్సకు అవసరమయ్యే మందుల తయారీదారులతో పాటు, వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశం అవుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి టాస్క్ ఫోర్స్ వరుసగా సమావేశం అవుతూ ఒక సమగ్ర కార్యాచరణ దిశగా ముందుకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు.