Instant Loan Apps Scam: ఇద్దరు ఆత్మహత్య..తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఆన్‌లైన్ మనీ స్కాం, పోలీసులు దర్యాప్తులో తిమ్మతిరిగే విషయాలు, హెచ్చరికలు జారీ చేసిన ఆర్‌బీఐ
తెలంగాణలో లోన్ యాప్స్ (Instant Loan Apps Scam)అంశం కలవరపాటుకు గురి చేస్తోంది. కరోనా సమయంలో లోన్లు ఇస్తామంటూ ఆన్ లైన్ యాప్స్ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఆ తర్వాత వారిని ముప్పతిప్పలు పెడుతున్నాయి.
Hyderabad, Dec 25: తెలంగాణలో లోన్ యాప్స్ (Instant Loan Apps Scam)అంశం ప్రకంపనలు రేపుతోంది. కరోనా సమయంలో లోన్లు ఇస్తామంటూ ఆన్ లైన్ యాప్స్ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఆ తర్వాత వారిని ముప్పతిప్పలు పెడుతున్నాయి. వారానికి 30 శాతానికి పైగా వడ్డీని వసూలు చేస్తూ.. కస్లమర్లను వేధింపులకు గురి చేస్తున్నాయి. దీంతో కొందరు ఈ వేధింపులు తట్టుకోలేక సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోన్ యాప్‌లకు సంబంధించిన మూలాలను బయటకు తీసేందుకు సైబర్‌క్రైం పోలీసులు (Cyberabad CyberCrime police) తమ దర్యాప్తును ముమ్మరం చేయగా దిమ్మతిరిగే విషయాలు బయటకు వచ్చాయి.
రుణ యాప్‌ల రిజిస్ట్రేషన్లు చైనాలోనే అధికంగా జరిగినట్టు సైబర్ క్రైం పోలీసులు తేల్చారు. అక్కడ రిజిస్ట్రేషన్ చేసిన యాప్‌లను (Illegal loan apps) చైనీయులే గూగుల్ ప్లేస్టోర్‌లో పోస్టు చేస్తున్నారనే విషయాన్ని రాబట్టారు. చైనాలో వాట్సాప్‌పై నిషేధం ఉండటంతో ఇండోనేషియా కేంద్రం గా భారత్‌లో ఉండే తమవారితో వ్యవహారాలను చక్కబెడుతున్నట్టు గుర్తించారు.
మరోవైపు రుణయాప్‌లకు సంబంధించి 350 బ్యాంకు ఖాతాల్లోని రూ.87 కోట్ల అనుమానాస్పద నిధులను గుర్తించి.. వాటి లావాదేవీలను నిలిపివేయాలంటూ ఆయా బ్యాంకులు, వ్యాలెట్లకు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు లేఖలు రాశారు. రుణ యాప్‌లకు సంబంధించి గుర్గావ్‌లో అరెస్ట్ చేసిన ఐదుగురిని గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన సీపీ సజ్జనార్
ఈ యాప్‌ల విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. మొబైల్ సందేశాల్లో వచ్చే లింక్‌లను ఓపెన్ చేయవద్దని..యాప్‌ల ద్వారా మోసపోయినవారు ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లోన్ యాప్‌ల కేసులో మరో ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. లోన్ యాప్‌ల ముఠాలో నలుగురు సభ్యులను నిన్న అరెస్టు చేశామని చెప్పారు. ఈ ముఠాలో కీలకపాత్ర పోషించిన చైనా వాసి పరారీలో ఉన్నారని..స్థానికులతో కలిసి చైనావాసులు రెండు డిజిటల్ కంపెనీలను, కాల్‌సెంటర్లు ఏర్పాటుచేసి రుణాలు వసూలు చేశారని చెప్పారు.
ఈ కేసుతో సంబంధమున్న మరో చైనావాసి ఫిబ్రవరిలో వ్యాపార వీసాపై వచ్చి దందాలో పాల్గొన్నాడని.. ఎప్పటికప్పుడు కొత్త కేంద్రాలు ఏర్పాటుచేసి వ్యాపారాన్ని విస్తరించుకున్నారని చెప్పారు. మొత్తం 11 యాప్‌లు సృష్టించి రుణాలు ఇచ్చారని తెలిపారు. ప్రత్యేకంగా 40 ఏండ్ల లోపు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని రుణాలిచ్చారన్నారు. రుణాలపై 25 నుంచి 30 శాతం వడ్డీ వసూలు చేసేవారని, ఒకవేళ రుణాల చెల్లింపులు ఆలస్యమైతే జరిమానా వసూలు చేసేవారని చెప్పారు. హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగించేవారని వెల్లడించారు.
లక్షల్లో వినియోగదారులు
లోన్ యాప్‌లకు లక్షల్లో వినియోగదారులు ఉన్నారని, రుణాలు తీసుకున్నవారి నుంచి తిరిగి వసూలు చేసే బాధ్యత కాల్‌సెంటర్లదేనని చెప్పారు. యాప్‌లకు ఎన్‌బీఎఫ్‌సీలతో సంబంధం లేదని తెలిపారు. నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. చైనా, సింగపూర్, ఇతర దేశాల నుంచి నిధులు వచ్చాయా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
లోన్ యాప్‌లే కాకుండా ఆటల యాప్‌ల్లోనూ మోసాలకు పాల్పడ్డారని చెప్పారు. యాప్‌ల దర్యాప్తులో రోజురోజుకూ కొత్త అంశాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. ఆన్‌లైన్ కాల్ మనీ కేసులో నలుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు చైనీస్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు ఉన్నారు. వారి వద్ద ఉన్న రూ.2 కోట్లు నగదు, 2 లాప్ టాప్‌లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కాల్‌సెంటర్లపై హైదరాబాద్ పోలీసులు దాడులు
బెంగళూర్‌లోని రెండు కాల్‌సెంటర్లపై హైదరాబాద్ పోలీసులు దాడులు చేశారు. 42 లోన్ యాప్‌లను లీఫంగ్, పిన్ ప్రింట్, నబులోం, హాట్‌ఫుల్ టెక్నాలజీస్ సంస్థలు నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో 27 కేసులు నమోదు చేశారు. 350 అకౌంట్ల నుంచి డబ్బు జమ అవుతున్నట్లు గుర్తించారు. మొత్తం రూ.87 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఈ యాప్‌లోనే లోన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
చైనాతో లింకులు
రుణయాప్‌ల మూలాలపై దృష్టిపెట్టిన పోలీసులు చైనా లింకులను గుర్తించారు. చైనాకు చెందిన ల్యాంబో ఫైనాన్స్, క్యూ యోన్ అనే మహిళ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలను భారత్‌లో ఉండి చక్కబెట్టినట్టు ఆధారాలు సేకరించారు. గుర్గావ్ సోదాలలో క్యూయోన్ పాస్‌పోర్టు పోలీసులకు చిక్కింది. ఆమె ఢిల్లీ పరిసరాల్లోనే ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కర్నూలుకు చెందిన నాగరాజు, కొత్తగూడెంకు చెందిన మధుబాబుతో కలిసి కాల్‌సెంటర్లు ఏర్పాటుచేసినట్టు నిర్ధారించుకున్నారు. గతంలో బెంగళూరు కాల్‌సెంటర్లలో పనిచేసిన నాగరాజు, మధుబాబు స్నేహితులుగా మారి.. తర్వాత గుర్గావ్ వెళ్లారు.
అక్కడ నాగరాజు ఢిల్లీ వాసులతోపాటు, చైనీయులతోనూ చెలిమిచేస్తూ రుణయాప్‌లకు సంబంధించి వ్యాపార విస్తరణ, అప్పుల వసూలు వంటి బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించాడు. ల్యాంబోతో కలిసి హైదరాబాద్‌లో కాల్‌సెంటర్లను ఏర్పాటుచేసిన నాగరాజు.. వారికి మధుబాబును హెడ్‌గా చేసి తిరిగి ఢిల్లీ వెళ్లిపోయాడు. గురువారం సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరులోని మరో కాల్‌సెంటర్‌పై దాడి చేశారు. ముఖ్యులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే మధుబాబును అరెస్ట్ చేయగా.. నాగరాజు కోసం గాలింపు చేపట్టారు.
రుణయాప్‌ల ఆగడాలను అరికట్టడంలో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సైబర్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని గురువారం ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ కే నిఖిలతో సమావేశమయ్యారు. ఇన్‌స్టంట్ రుణాల పేరిట అప్పులు ఇచ్చి, వాటి వసూళ్ల విషయంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ (ఎన్‌బీఎఫ్‌సీ)లో రిజిస్టరైన ఆన్‌లైన్ రుణ యాప్‌ల నిర్వాహకుల తీరును వివరించారు. ఎన్‌బీఎఫ్‌సీతో ఒప్పందం కుదుర్చుకున్న యాప్‌లు రుణ గ్రహీతలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. నిర్వాహకులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.
ఆర్బీఐలో రిజిస్టర్ అయిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీకు ఆయా రాష్ర్ట ప్రభుత్వాల మనీ ల్యాండరింగ్ యాక్ట్ మేరకు నిర్దేశిత ప్రక్రియ ఉంటుందని.. దానికి అనుగుణంగానే అప్పులిస్తాయని ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల తెలిపారు. ఆర్బీఐతో అనుసంధానం ఉన్న ఆర్థికసంస్థలపై ఫిర్యాదులు, ఇతర వివరాలను https://cms.rbi.org.in పోర్టల్ ద్వారా చూసుకోవచ్చన్నారు.
హెచ్చరికలు జారీ చేసిన ఆర్‌బీఐ
ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI రుణ గ్రహీతలను హెచ్చరించింది. లోన్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరీముఖ్యంగా యాప్స్ ద్వారా రుణం పొందే వారు అప్రమత్తంగా ఉండాలని కోరింది. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపింది .సులభంగానే, త్వరితగతిన రుణం లభిస్తోందని అనధికార డిజిటల్ లెండింగ్, మొబైల్ యాప్స్ ద్వారా లోన్ తీసుకునేటప్పుడు జగ్రత్తగా ఉండాలని ఆర్‌బీఐ పేర్కొంది. మొబైల్ యాప్ ద్వారా లోన్ తీసుకునేటప్పుడు సదురు కంపెనీ వివరాలను పూర్తిగా ధృవీకరించుకోవాలని తెలిపింది.
అంతేకాకుండా తెలియని వ్యక్తులను కేవైసీ డాక్యుమెంట్లు అందించవద్దని కోరింది. అనధికార యాప్స్ ఉంటే వాటి వివరాలను తమకు తెలియజేయాలని కోరింది. https://sachet.rbi.org.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల తరుపున రుణాలు అందించే యాప్స్ ముందుగానే కస్టమర్లకు ఎవరి తరుపున రుణాలు అందిస్తున్న విషయాన్ని తెలియజేయాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది.
కాల్ సెంటర్లలో ఉద్యోగులే డైరెక్టర్లు
మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ దగ్గరకు వచ్చేసరికి వీటికి సంబంధించిన కాల్ సెంటర్లలో ఉద్యోగుల్నే డైరెక్టర్లుగా ఉంచుతున్నాయి. ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి వాట్సాప్ ద్వారా ఆదేశాలు పంపుతూ వీటిని రన్ చేస్తున్నాయి. గుర్గావ్‌లోని ఉద్యోగ్ విహార్‌లో ఉన్న 2, హైదరాబాద్‌లోని బేగంపేట, పంజగుట్టల్లోని 3 కాల్ సెంటర్లు 30 యాప్స్ కోసం పనిచేస్తున్నాయి.
ఇవన్నీ లియోఫంగ్ టె క్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, హాట్‌ఫుల్ టెక్నాలజీస్ ప్రై.లి., పిన్ ప్రింట్ టెక్నాలజీస్ ప్రై.లి., నబ్లూమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో బెంగళూరులో రిజిస్టరైన సంస్థల అధీనంలో నడుస్తున్నాయి. పంజగుట్టలోని కాల్ సెంటర్‌లో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న జీవన జ్యోతితో పాటు సెల్వరాజ్ సింగిలు లియోఫంగ్, హాట్‌ఫుల్‌లకు, రవికుమార్ మంగల, వెంకట్‌లు పిన్ ప్రింట్, నబ్లూమ్‌లకు డైరెక్టర్లుగా ఉన్నారు.
హైదరాబాద్‌లోని కాల్ సెంటర్లలో 600 మంది, గుర్గావ్‌లోని వాటిల్లో 500 మంది టెలికాలర్స్‌గా ఉన్నారు. వీళ్లు కార్పొరేట్ ఆఫీసుల మాదిరిగా షిఫ్ట్‌ల వారీగా, 24 గంటలూ విధులు నిర్వర్తిస్తూ జకార్తా నుంచి వస్తున్న ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారు. ఈ సంస్థల్లోని ఉద్యోగులు ప్రతి 2–3 నెలలకు మారిపోతుండటం వెనుక ఏమైనా కారణముందా? అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తల్లి ఫోటో మార్పింగ్ తో వేధింపులు
సింగరేణికాలనీకి చెందిన దావులూరి సాయి అరవింద్ నవంబర్‌లో మై బ్యాంక్ ఋణయాప్ నుండి రూ.2,600 రుణంగా తీసుకున్నాడు. వారం రోజుల వ్యవధిలో వడ్డీతో కలిపి రూ.3,500 చెల్లించాడు. కొద్దిరోజుల తరువాత అదే యాప్ నుండి రూ.30,000 లోన్ తీసుకున్నాడు. ఆ రుణాన్ని వారంలోపు వడ్డీతో కలిసి రూ.55,000 చెల్లించాలనేది యాప్ నిబంధన.
రెండోసారి తీసుకున్న అప్పును అరవింద్ సకాలంలో చెల్లించలేకపోయాడు. దాంతో యాప్ నిర్వాహకులు అరవింద్‌ను బ్లాక్‌మెయిల్ చేయటం మొదలుపెట్టారు. అతని ఫోన్ నుంచి యాక్సెస్ చేసుకున్న కాంటాక్ట్ నంబర్లు, వాట్సప్ గ్రూపుల ద్వారా అతన్ని బహిరంగంగా అవమానించటం మొదలుపెట్టారు. రుణం చెల్లిస్తానని చెప్పినా ఆలస్యమైనందున ప్రతీరోజుకు రూ.3000 వడ్డీ చెల్లించాలని షరతు పెట్టారు.
యాప్ నిర్వాహకులు అరవింద్ తల్లి ఫొటోలను అవమానకర రీతిలో మార్ఫింగ్ చేసి అతడి సన్నిహితుల నంబర్లతో క్రియేట్ చేసిన గ్రూపుల్లో పెట్టి వేధింపులకు పాల్పడ్డారు.వారి వ్యవహారశైలితో మనస్తాపం చెందిన అరవింద్ యాప్ నిర్వాహకులపై శనివారం రాత్రి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైదాబాద్ పోలీసులు మైయాప్ నిర్వాహకులపై ఐపీసీ 384, 420, 504, 506 ఏపీ తెలంగాణ మనీ లెండింగ్ యాక్ట్ సెక్షన్ 3, 13 కింద కేసు నమోదు చేశారు.
వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
అప్పు ఇచ్చిన సంస్థ వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆన్‌లైన్ యాప్‌ల నుంచి రూ.50 వేల రుణం తీసుకుని, అధికవడ్డీలు చెల్లించలేక మనోవేదనతో తనువు చాలించాడు. గుంటూరు మంగళ గిరికి చెందిన సునీల్(29) హైదరాబాద్ నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
భార్య, ఆరునెలల కూతురుతో కలిసి రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్‌లో నివసిస్తున్నాడు. కరోనా పరిణామాల నేపథ్యంలో సునీల్ ఉద్యోగం పోవడంతో పలు ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా మొత్తం రూ.50 వేలు అప్పు చేశాడు. 30 శాతం వడ్డీతో డబ్బులు చెల్లించాలని యాప్‌ల నిర్వాహకులు ఇటీవల అతడిపై తీవ్ర ఒత్తిడి చేశారు. వీటితో పాటు సునీల్‌కు వ్యక్తిగతంగా మరో రూ.6 లక్షల అప్పు ఉంది.
మూడు నెలల క్రితం స్వగ్రామంలో ఉన్న భూమిని విక్రయించి తల్లిదండ్రులు ఆ అప్పు చెల్లించారు. అనంతరం తండ్రి వెంకటరమణ సునీల్‌కి మరో రూ.లక్ష కూడా ఇచ్చాడు. అయితే, ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తీవ్రమవడంతో పది రోజులక్రితం సునీల్ సైబర్ క్రైంకు ఎస్‌ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్వయంగా ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించగా సునీల్ వెళ్లలేదు.
ఇదిలా ఉండగా, అతడికి మూడు రోజులక్రితం బంజారాహిల్స్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో రూ.7 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. బుధవారం మధ్యాహ్నం కంపెనీ నిర్వాహకులు కాల్ చేయగా, ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. ఉద్యోగం మరొకరికి ఇవ్వండి’అని చెప్పి కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్‌ఆఫ్ చేశాడు.
మరో చోట సెల్ఫీ సూసైడ్
ఇక ఆన్‌లైన్‌లో అప్పులు ఇచ్చిన యాప్‌ల నిర్వాహకులు సునీల్ ఫోన్ డేటాను హ్యాక్ చేసి, అతడి స్నేహితులు, బంధువులకు ‘సునీల్ డిఫాల్టర్’అని అతడి ఫొటోతో మెసేజ్‌లు పంపారు. దీంతో సునీల్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. బుధవారం రాత్రి భోజ నం చేసేందుకు రమ్మని సునీల్ భార్య తలుపు తట్టగా స్పందన లేకపోవడంతో, కిటికీ లోంచి చూడగా అతడు ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.
వెంటనే స్పందించిన సుబ్రహ్మణ్యం అతన్ని గోదావరిఖని ఆస్పత్రికి అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. విశాఖపట్పం నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు సంతోష్‌ను మెరుగైన వైద్యం కోసం వైజాగ్‌కు తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 23న మృతి చెందారు.
సూసైడ్ సెల్ఫీ వీడియో ద్వారా సుబ్రహ్మణ్యం ఎన్టీపీసీ పోలీసులకు పిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం 5 లోన్ యాప్‌ల ద్వారా సంతోష్ రూ. 54 వేలు అప్పు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఉదాన్‌లోన్ యాప్, రుపీ లోన్ యాప్, రూపేలోన్ యాప్, ఎఎఎ-క్యాష్ లోన్ యాప్, లోన్‌గ్రాన్ యాప్‌లలో అతను అప్పుగా తీసుకున్నట్టుగా సమాచారం.
లోన్‌యాప్‌లపై దర్యాప్తునకు ఏపీ మార్గదర్శకాలు
లోన్ యాప్‌ల మోసాలపై దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేశారు. యాప్‌ల రికవరీ ఏజెంట్లు రుణం తీసుకున్న కుటుంబంలోని మహిళలను వేధించినా, తరుచూ ఫోన్ చేసినా, బెదిరించినా సెక్షన్ 509, 354(సీ) కింద చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పేమెంట్ గేట్‌వేల ద్వారా కాకుండా నేరుగా డబ్బు వసూలు చేసినా, అధికంగా వడ్డీ వసూలు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
నకిలీ ఎఫ్‌ఐఆర్‌లు, లెటర్లు పంపుతూ కస్టమర్లను బెదిరిస్తే సెక్షన్ 463, 464, 466, 469 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నారు. నకిలీ లోన్ యాప్‌లను ప్లేస్టోర్ నిర్వాహకులు తొలిగించకపోయినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వేధింపుల వల్ల ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే సెక్షన్ 306 కింద కేసు నమోదు చేయనున్నారు. ఈ మార్గదర్శకాలతోపాటు మొత్తం 15 నకిలీ లోన్ యాప్‌ల జాబితాను విడుదల చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)