Hyderabad, Dec 25: కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు (TS Govt) అప్రమత్తమైంది. ఇందులో భాగంగా నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదని (New Year Celebrations Ban), పబ్స్, రిసార్ట్స్, హోటల్స్‌పై పటిష్ట నిఘా ఉంటుందని ఆయన తెలిపారు.
ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి వేడుకలు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సజ్జనార్ (CP sajjanar) సూచించారు. గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్ కాలనీల్లోనూ వేడుకలు నిషిద్ధం (New Year Celebrations Ban in Hyderabad) అని పేర్కొన్నారు. డ్రంకన్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నామని, ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో కొత్త కరోనా స్ట్రెయిన్ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 16కు అనుమానిత పాజిటివ్ కేసుల సంఖ్య (New Covid Strain in TS) చేరింది. 16 మందితో అత్యంత సన్నిహితంగా ఉన్న.. 76 మందిని గుర్తించిన అధికారులు హోం క్వారంటైన్ చేశారు. 1,200 మందిలో ఇప్పటివరకు 926 మందిని అధికారులు గుర్తించారు. పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్‌ను వైద్యులు సీసీఎంబీకి పంపారు. మరో రెండు రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇటీవల యూకే నుంచి తెలంగాణకు 1,200 మంది ప్రయాణికులు వచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 800 మంది యూకే వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాల్లో యూకే వెళ్లొచ్చిన వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల యూకే నుంచి కరీంనగర్, ఆదిలాబాద్ పలువురు వచ్చినట్లు తెలుస్తోంది. యూకే నుంచి వచ్చిన వారి నుంచి శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్‌కు వైద్యులు పంపారు. సిద్దిపేటకు చెందిన ఓ మహిళకు ఆర్టీపీసీఆర్ టెస్టులో కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అయితే ఏ రకమైన కోవిడ్ లక్షణాలో నిర్దారించుకోడానికి వైద్యాదికారులు సీసీఎంబీకి శాంపిల్స్ పంపించారు. రెండు రోజుల్లో రిపోర్టు రానుంది. దీంతో సిద్దిపేట ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కొత్త రకం స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను ఇళ్లలోనే జరుపుకోవాలి’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు.
ఇదిలా ఉంటే మహబూబాబాద్ జిల్లా అయోధ్యలో కొత్తరకం కొవిడ్ కలకలం రేపుతోంది. 70 మంది అస్వస్థతకు గురవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు ఆసుపత్రి బాట పట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తీవ్ర అస్వస్థతగా ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.