Dalit Woman Torture Case: దళిత మహిళపై థర్డ్ డిగ్రీ కేసు, షాద్‌నగర్ పోలీసులపై కేసు నమోదు, ఇప్పటికే డిటెక్టివ్ సీఐ రామిరెడ్డితో పాటు కానిస్టేబుళ్లు సస్పెండ్
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులపై కేసులు నమోదయ్యాయి
Shadnagar, August 16: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో షాద్ నగర్ ఇన్‌స్పెక్టర్ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులపై కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఈ ఘటనలో డిటెక్టివ్ సీఐ రామిరెడ్డితో పాటు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ఓ చోరీ కేసులో దళిత మహిళ సునీతను పీఎస్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టినట్లు వచ్చి ఆరోపణల నేపథ్యంలో ఏసీపీ రంగస్వామి ఘటనపై విచారణ జరిపారు. అనంతరం నివేదికను సైబరాబాద్ సీపీకి సమర్పించగా, నివేదిక ఆధారంగా డీఐతో పాటు ఉన్న కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఘటన వివరాల్లోకెళితే.. జులై 30న షాద్‌నగర్ సీఐ రామిరెడ్డితో పాటు నలుగురు పోలీసులు దళిత మహిళ, ఆమె భర్తను స్టేషన్‌కు తీసుకెళ్లారు. నాగేందర్ అనే వ్యక్తి ఇంట్లో చోరీకి సంబంధించి విచారణకు తీసుకెళ్లిన పోలీసులు తొలుత ఆమె భర్తను కొట్టారు. ఆ తర్వాత దళిత మహిళ దుస్తులు తొలగించి భర్త నిక్కరు తొడిగి లాఠీతో దాడి చేశారు. ఇద్దరు పోలీసులు తొడభాగంపై కాళ్లతో తొక్కుతుండగా, ఛాతీభాగంలో రబ్బరుతో రాత్రి 2 గంటల వరకూ స్పృహ తప్పేలా కొట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే పెట్రోలు పోసి తగలబెడతామని పోలీసులు బెదిరించారు. రంగారెడ్డి జిల్లా పోలీసుల అమానుషం, దళిత మహిళపై థర్డ్ డిగ్రీ,దొంగతనం ఒప్పుకోవాలని చిత్రహింసలు, సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, బాధిత పోలీస్ పై చర్యలు
మహిళ కుమారుడిని సైతం పోలీసులు దారుణంగా కొట్టారు. ఆ తర్వాత ఫిర్యాదుదారు నాగేందర్ కారులోనే ఇంటికి పంపించారంటూ బాధితులు ఈనెల 11న పోలీసులకు ఫిర్యాదు చేయగా, అదే రోజు కేసు నమోదైంది. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. దళిత మహిళపై దాడి వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలైంది.
న్యాయవాది, సమతా సైనిక్ దళ్ న్యాయ సలహాదారు డాక్టర్ బీ కార్తీక్ నవయన్ ఎన్‌హెచ్‌ఆర్‌సీలో గురువారం ఫిర్యాదు చేశారు. సునీతపై దాడికి పాల్పడ్డ డిటెక్టివ్ సీఐ రామిరెడ్డి నలుగురు కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించాలని, అరెస్టు చేసి శిక్షించాలని పిటిషన్‌లో కోరారు. కేసు సీబీఐకి అప్పగించి దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద బాధితురాలికి పరిహారంతో ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దాడి వ్యవహారంలో కేసు నమోదు కాగా, నిష్పక్షపాత విచారణ చేసి న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.