Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్ట్, విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పిన ఈడీ, అనారోగ్యంతో రాలేనని తెలిపిన కవిత
తాను విచారణకు హాజరుకాలేనని ఈడీ అధికారులకు తెలిపారు. మరికాసేపట్లో ఈడీ (ED) ముందు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె ఈ- మెయిల్ ద్వారా అధికారులకు సమాచారం పంపారు. అనారోగ్యం, సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఈడీ విచారణకు రాలేకపోతున్నట్టు పేర్కొన్నారు.
Hyd, Mar 16: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సిన ఎమ్మెల్సీ కవిత ట్విస్ట్ ఇచ్చారు. తాను విచారణకు హాజరుకాలేనని ఈడీ అధికారులకు తెలిపారు. మరికాసేపట్లో ఈడీ (ED) ముందు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె ఈ- మెయిల్ ద్వారా అధికారులకు సమాచారం పంపారు. అనారోగ్యం, సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఈడీ విచారణకు రాలేకపోతున్నట్టు పేర్కొన్నారు.
మరో రోజు విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 11న జరిగిన విచారణలో ఈడీ (Enforcement Directorate) అధికారులు అడిగిన పత్రాలను తన న్యాయవాది భరత్ ద్వారా కవిత పంపారు.ఈ నెల 11న దాదాపు ఎనిమిది గంటల పాటు కవితను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు.. 16న మరోసారి విచారణకు రావాలని అదే రోజు సమన్లు ఇచ్చిన విషయం తెలిసిందే.
రెండో సారి హాజరు కావాలంటే ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ కవిత (BRS MLC K Kavitha) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆమె దాఖలు చేసిన వ్యాజ్యంపై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈనెల 24న విచారణ చేపడతామని సీజేఐ స్పష్టం చేశారు. ఈ నెల 16న హాజరు కావడంపై ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సైతం కోర్టు నిరాకరించిన నేపథ్యంలో కవిత ఈరోజు ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఆమె హాజరు కాలేనంటూ ట్విస్ట్ ఇచ్చారు. కవిత ఈడీ విచారణ దృష్ట్యా మంత్రులు కేటీఆర్‌తో పాటు హరీశ్‌రావు, ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.
అయితే కవిత విజ్ఞప్తికి ఈడీ డైరెక్టర్ అంగీకరించలేదు. విచారణకు రావాల్సిందేనని తేల్చిచెప్పారు. దీంతో కవిత ఇవాళ విచారణకు వెళ్తారా లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఆమె వెళ్లకపోతే ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది.మరోవైపు రేపటితో ఈ కేసులో ఇద్దరు కీలక నిందితుల ఈడీ కస్టడీ ముగియనుంది. మనీశ్ సిసోడియా, అరుణ్ చంద్ర పిళ్లై, బుచ్చిబాబులను ఎదురుగా పెట్టి కవితను ఈడీ విచారించాలనుకుంది. దీంతో ఈ ముగ్గురి కస్టడీ ముగిశాకే విచారణకు హాజరుకావాలని కవిత వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.