Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు, కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 4కు వాయిదా పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఈడీకి నోటీసులు

కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 4 తర్వాత చేపడతామని తెలిపింది.

BRS MLC Kavitha (Photo-ANI)

New Delhi, April 1: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో చుక్కెదురైంది. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 4 తర్వాత చేపడతామని తెలిపింది.

తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్‌ 16 వరకు మధ్యంతర బెయిల్‌ లేదా సాధారణ బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై రౌస్‌ అవెన్యూ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది.. కవిత పిటిషన్‌పై సమాధానం చెప్పాలని న్యాయస్థానం ఈడీకి నోటీసులు జారీ చేస్తూ.. విచారణను వాయిదా వేసింది. తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఏప్రిల్‌ 15వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన రౌస్‌ అవెన్యూ కోర్టు

బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో వాదనలు వాడీవేడీగా జరిగాయి. కవిత తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. కవిత విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, ఈ కేసులో ఆమెను అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. సమన్లకు స్పందించినా, విచారణకు సహకరించినా అరెస్ట్‌ చేశారని పేర్కొన్నారు. సీఆర్‌పీసీ 160 ప్రకారం తొలి సమన్లలోనే ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. ఈడీ అధికారులు కవితను ఒక్కోసారి రాత్రి కూడా విచారించారని చెప్పారు.

ఈ సందర్భంగా అరుణ్‌ పిళ్లై స్టేట్‌మెంట్‌ అంశాలను సింఘ్వీ కోర్టు ముందుకు తెచ్చారు. ఆయన తొమ్మిది స్టేట్‌మెంట్‌లు ఒక రకంగా ఉంటే పదో స్టేట్‌మెంట్‌ పూర్తి విరుద్దంగా ఉందన్నారు. 18 నెలల ముందు దాఖలు చేసిన చార్జ్ షీట్, అడిషనల్ చార్జ్ షీట్‌లో నిందితురాలిగా, ముద్దాయిగా కవిత పేరు లేదన్నారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్‌ 4కు వాయిదా వేసింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గత నెల 15న హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను ఈడీ అరెస్టు చేసి మరుసటి రోజు రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. ముందుగా ఈడీ 10 రోజుల కస్టడీకి కోరగా.. న్యాయస్థానం ఏడు రోజులకు అనుమతి ఇచ్చింది. అనంతరం మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడు రోజులకు అనుమతించింది. ఈడీ కస్టడీ మార్చి 26న ముగియడంతో.. అదే రోజు కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు ఆమెను హాజరు పరిచారు. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించడంతో తిహార్ జైలుకు తరలించారు.