IPL Auction 2025 Live

Disha Encounter Hearings: ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పదమేంటో నాకు తెలియదు, నేను తెలుగు సరిగా మాట్లాడలేను, జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ఎదుట హాజరైన వీసీ సజ్జనార్

దిశ హత్యాచార కేసులో (Disha rape and murder Case) నలుగురు నిందితులను పోలీసు కస్టడీకి తీసుకున్న విషయం తనకు తెలియదని అప్పటి సైబరాబాద్‌ సీపీ, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ (Former Cyberabad commissioner V C Sajjanar) స్పష్టం చేశారు.

Cyberabad Police Commissioner VC Sajjanar | Four accused (Photo Credits: IANS)

Hyd, Oct 13: సైబరాబాద్‌ మాజీ పోలీస్‌ కమిషనర్ వీసీ సజ్జనార్‌ రెండో రోజు మంగళవారం జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ముందు హాజరయ్యారు. దిశ హత్యాచార కేసులో (Disha rape and murder Case) నలుగురు నిందితులను పోలీసు కస్టడీకి తీసుకున్న విషయం తనకు తెలియదని అప్పటి సైబరాబాద్‌ సీపీ, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ (Former Cyberabad commissioner V C Sajjanar) స్పష్టం చేశారు. ‘దిశ’నిందితులు మహ్మద్‌ ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులులో ఆరీఫ్‌ మినహా మిగిలిన ముగ్గురు జువెనైల్స్‌ అనే విషయం తనకి తెలియదని కమిషన్‌ ముందు సజ్జనార్‌ వాంగ్మూలం ఇచ్చారు.

అలాగే 2019, డిసెంబర్‌ 5 రాత్రి సమయంలో నిందితులను రవి గెస్ట్‌ హౌస్‌లో విచారించమని తాను చెప్పలేదని.. సురక్షిత ప్రదేశంలో మాత్రమే నిందితులను ఉంచాలని సూచించానని వివరించారు. కేసు దర్యాప్తులో ఉండటం, దిశ వస్తువుల రికవరీ ఉన్నందునే చర్లపల్లి జైలు నుంచి నిందితులను తీసుకెళ్లామని చెప్పారు. ఆ సమయంలో ముద్దాయిలకు సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ సమాచారం ఇవ్వలేదని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసును సాధారణ నేరంగా ఎలా పరిగణించారని, పైగా కేసు విచారణలో ‘మార్నింగ్‌ బ్రీఫింగ్‌’కే పరిమితం అయ్యానని అనడంపై కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

నేరం జరిగిన ప్రాంతానికి అత్యున్నత అధికారిగా ఉంటూ ఎస్‌ఓటీ బృందాల ఏర్పాటు, విచారణ, ఎస్కార్ట్‌ పోలీసులకు ఆయుధాలు, సమాచార సేకరణ, అరెస్ట్‌.. ఇలా ప్రతీదీ మీ కంటే కిందిస్థాయి అధికారి(డీసీపీ ఎన్‌. ప్రకాశ్‌రెడ్డి)కే తెలుసని చెప్పడం సరైందికాదని అసహనం వ్యక్తం చేసింది. 2019 డిసెంబరు 6 ఉదయం 6.15 గంటలకు ఎదురుకాల్పుల్లో నలుగురు నిందితులు మరణించినట్లు శంషాబాద్‌ డీసీపీ తనకు సమాచారం ఇచ్చారన్నారు.

రెండో రోజు దాదాపు నాలుగున్నర గంటల పాటు 120 ప్రశ్నలను సజ్జనార్‌పై విచారణ కమిషన్‌ (Disha Encounter Hearings) సంధించింది. పలు ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో.. అడిగిన ప్రశ్నకే పరిమితమై నేరుగా సమాధానం చెప్పాలని విచారణ కమిషన్‌ స్పష్టం చేసింది. దిశ ఘటన తర్వాత ప్రజల్లో భయం నెలకొందని, డయల్‌-100, షీటీమ్స్‌పై అవగాహన కల్పించేందుకే 2019 నవంబరు 29న ప్రెస్‌మీట్‌ నిర్వహించానని సజ్జనార్‌ చెప్పడం గమనార్హం.

అవగాహన కోసమైతే.. ఆ ప్రెస్‌మీట్‌లో ఏ1 నిందితుడి వాంగ్మూలాన్ని ఎందుకు వెల్లడించారని ప్రశ్నించింది. కోర్టు పరిధిలోని అంశాన్ని మీడియా ద్వారా ప్రజలకు ఎందుకు చెప్పారని నిలదీసింది. శంషాబాద్‌ డీసీపీ ఇచ్చిన సమాచారం మేరకు వెల్లడించానని సజ్జనార్‌ సమాధానం ఇవ్వడంతో.. ‘‘మీరు స్వతంత్రంగా ఆలోచించరా? మీకంటూ ఒక అభిప్రాయం ఉండదా? అన్ని ప్రశ్నలకు శంషాబాద్‌ డీసీపీ అని సమాధానం చెబుతున్నారు? ఇంతకు మీరేం చేస్తారు?’’ అని కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సైబరాబాద్‌కు తాను శాంతిభద్రతల పర్యవేక్షణ ఇన్‌చార్జ్‌ అని, క్షేత్రస్థాయి అధికారుల నుంచి వచ్చే సమాచారం మేరకు వ్యవహరిస్తారని చెప్పారు. ‘‘మీ కమిషనరేట్‌ పరిధిలో ఏం జరిగినా మీకు బాధ్యత ఉంటుంది కదా?’’ అని ప్రశ్నించగా.. ఆ వాదనతో తాను ఏకీభవించబోనన్నారు. దిశ అదృశ్య ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదులో జాప్యం జరిగింది వాస్తవమేనా? అని కమిషన్‌ ప్రశ్నించగా.. అవునని సమాధానమిచ్చారు. నిందితులను గెస్ట్‌హౌస్‌లో ఉంచేందుకు తాను ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. ఫైరింగ్‌లో స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌(ఎస్‌వోటీ)కి చెందిన ఎస్సైలు లాల్‌ మదార్‌, రవి, హెడ్‌కానిస్టేబుల్‌ సిరాజుద్దీన్‌ పాల్గొన్నారని తెలిపారు.

దిశను కాల్చిన చోటే కాల్చివేత, యువ వెటర్నరీ డాక్టర్ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులు

ఇక దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ స్థలంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించడంపై కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. మృతదేహాల పంచనామా పూర్తికాకుండానే ప్రెస్‌మీట్‌ పెట్టడమేంటని ప్రశ్నించింది. నాలుగు భాషల్లో సజ్జనార్‌ మాట్లాడటంపై ఆశ్చర్యం వ్యక్తంచేసింది. సంఘటన స్థలంలో ప్రెస్‌మీట్‌ ఏర్పాటుకు కుర్చీలు, టేబుళ్లు ఎవరు సమకూర్చారని సజ్జనార్‌ను అడిగింది. ఈ ప్రశ్నలకు తనకు తెలుగు సరిగా రాదని, 20 ఏళ్లుగా తెలంగాణలో పనిచేస్తున్నా.. ఇక్కడ ఎక్కువ మంది హిందీ మాట్లాడుతారని చెప్పారు. ‘‘ఐపీఎస్‌ అధికారిగా తెలుగు భాష పరీక్ష రాయలేదా?’’ అని ప్రశ్నించగా.. 2000లోనే తెలుగు పరీక్ష పాసయ్యానని సజ్జనార్‌ చెప్పారు. తాను తెలుగు బాగా రాయగలనని, అంత వేగంగా మాట్లాడలేనని చెప్పారు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు అంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై ప్రశ్నించగా.. ఆ పదానికి అర్థం తెలియదని, తాను ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు కాదని పేర్కొన్నారు.

దిశ హత్యాచార కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని, ఆ కేసును సజ్జనార్‌ తాను పర్యవేక్షించలేదని చెప్పడం హస్యాస్పదంగా ఉందని కమిషన్‌ వ్యాఖ్యానించింది. అది స్ట్రీట్‌ క్రైమ్‌ కాదని స్పష్టం చేసింది. కీలక కేసులో బాధ్యాతాయుతంగా వ్యవహరించాల్సిన సీపీ.. తనకు సంబంధం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీసింది. మొత్తంగా వేరే విషయాలతో తాను బిజీగా ఉన్నానని, అందుకే కేసు దర్యాప్తును పర్యవేక్షించలేదని ఆయన సమాధానమిచ్చారు.

సజ్జనార్‌ విచారణ అనంతరం.. దిశ కేసులో పాల్గొన్న పోలీసులు, నిందితుల కాల్‌ డేటా, టవర్స్‌ వివరాలు, లొకేషన్స్‌ గురించి సంబంధిత నెట్‌వర్క్‌ అధికారులను కమిషన్‌ విచారించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ సబ్‌ డివిజినల్‌ ఇంజనీర్‌ ఎన్‌. శ్రీనివాసులు, రిలయెన్స్‌ జియో నోడల్‌ ఆఫీసర్‌ జితేందర్, వొడా ఫోన్‌–ఐడియా ప్రత్యామ్నాయ నోడల్‌ ఆఫీసర్‌ పీ. జయలక్ష్మి, భారతీ ఎయిర్‌టెల్‌ చీఫ్‌ నోడల్‌ ఆఫీసర్‌ వీ.వెంకటనారాయనన్‌ను కమిషన్‌ తరుఫు న్యాయ వాది విరూపాక్ష దత్తాత్రేయ గౌడ విచారించారు.