Disha Encounter: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు, జ్యుడీషియల్ కమిషన్ ముందుకు వీసీ సజ్జనార్, కేసులో కీలకం కానున్న సజ్జనార్ స్టేట్‌మెంట్
జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ ను నియమించిన సంగతి విదితమే. దిశ’ హత్యాచారం నిందితులను సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌కు తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందనే అంశంపై కమిషన్ విచారణ చేస్తోంది.
Hyd, Oct 11: దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై (Disha Encounter) విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టు.. జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ ను నియమించిన సంగతి విదితమే. దిశ’ హత్యాచారం నిందితులను సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌కు తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందనే అంశంపై కమిషన్ విచారణ చేస్తోంది.
ఈ నేపథ్యంలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న ప్రస్తుత ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం త్రిసభ్య కమిటీ (సిర్పుర్కర్ కమిషన్) (VC Sajjanar to appear before Sirpurkar commission) ఎదుట హాజరుకానున్నారు. సజ్జనార్ ఈ రోజు విచారణకు హాజరు కావాలని జ్యుడీషియల్ కమిషన్ ఆదేశించింది. ఎన్‌కౌంటర్ ఘటనపై సజ్జనార్ స్టేట్‌మెంట్‌ను కమిషన్ నమోదు చేయనుంది. కాగా, ఇప్పటికే ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబాలు, సిట్ చీఫ్ మహేష్ భగవత్, పలువురు సాక్ష్యుల వాంగ్ములాలు కమిషన్ నమోదు చేసింది. అయితే ఈ కేసులో సజ్జనార్ స్టేట్‌మెంట్ కీలకం కానుంది.
‘దిశ’ కేసులో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌కు.. షాద్‌నగర్ ఆర్‌అండ్‌బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. రాజశేఖర్, ఫరూక్‌నగర్ అడిషనల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ రహుఫ్ పంచ్ సాక్షులుగా ఉన్నారు. గతంలో రాజశేఖర్‌ను విచారించిన కమిషన్ శుక్రవారం అబ్దుల్ రహుఫ్‌ను విచారించింది. సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులతో పాటు తాము కూడా వెళ్లామని, ఆ సమయంలో నిందితులు పోలీసులపై తిరగబడ్డారని తెలిపాడు.
రాళ్లతో కొట్టారని త్రిసభ్య కమిటీ ముందు ఆత్మవిశ్వాసంతో చెప్పిన అబ్దుల్ రహుఫ్ కొన్ని ప్రశ్నలకు మాత్రం అస్పష్టమైన సమాధానాలు చెప్పారు. ఎవరి చేతుల్లో నుంచి ఎవరు తుపాకులు లాక్కున్నారు? మిగిలిన వాళ్లు ఎవరి మీద రాళ్లు విసిరారు? అని కమిషన్ ప్రశ్నించగా.. ఆ సమయంలో తన కళ్లలో మట్టి పడిందని, అందుకే సరిగా చూడలేకపోయానని రహుఫ్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ‘దిశ’ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నిందితుల కుటుంబసభ్యుల తరఫున కృష్ణమాచారి హాజరయ్యారు.