Manchu Manoj Bindover: మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం, రాచకొండ కమిషనర్ ముందు మంచు మనోజ్ బైండోవర్
ఏడాది పాటు ఈ బైండోవర్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు అధికారులు స్పష్టం చేశారు.
Hyderabad, DEC 11: గత మూడు రోజులుగా మంచు టౌన్ షిష్‌లో (Manchu Township) చోటు చేసుకున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకుని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు 126 బిఎన్ఎస్ ప్రకారం జిల్లా అదనపు మేజిస్ట్రేట్ హోదాలో సినీ నటుడు మంచు మనోజ్‌కు (Manchu Manoj) నోటీసులు ఇచ్చారు.. ఈ క్రమంలో బుధవారం నేరేడ్ మెట్ లోని పోలీస్ కమిషనరేట్ లో అదనపు మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న సుధీర్ బాబు (Sudheer babu) ముందు మనోజ్ హాజరు అయ్యారు. మంచు మనోజ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కుటుంబ వివాదాలను శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదని, ఇరు వర్గాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా అదనపు మెజిస్ట్రేట్ సూచించారు. మంచు టౌన్ షిప్ పరిసరాల్లో శాంతియుత వాతావరణానికి ఆటంకం కలిగించొద్దని , చట్టపరమైన నిబంధనలకు లోబడి ఉండాలన్నారు.
దీంతో అదనపు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మంచు మనోజ్ ఒక సంవత్సరం కాలం పాటు ఆదేశాలకు కట్టుబడి ఉంటానని బాండ్ రాసి ఇచ్చారు. . దీంతో మంచు మనోజ్ ను పోలీసులు బైండోవర్ చేశారు. ఏడాది పాటు ఈ బైండోవర్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు అధికారులు స్పష్టం చేశారు.
ఇక సాయంత్రం మంచు విష్ణు సైతం అదనపు జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరు అయ్యారు. తన తరఫు వాదనలు వినిపించి తనకు కోర్టు 24 తేదీ వరకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల గురించి తెలిపారు. ఎలాంటి సమస్యలు సృష్టించవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదు అని ఈ సందర్భంగా అదనపు మెజిస్ట్రేట్ తెలియజేశారు.