ED Notices To KTR: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బిగ్ ట్విస్ట్.. కేటీఆర్ కు ఈడీ నోటీసులు.. జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లు
ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
Hyderabad, Dec 28: తెలంగాణ రాజకీయాల్లో (Telangana) సంచలనంగా మారిన ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బిగ్ ట్విస్ట్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR) కు తాజాగా ఈడీ (ED) అధికారులు నోటీసులు ఇచ్చారు. జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. కేటీఆర్ సహా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఫార్ములా ఈ-కారు రేసు కేసును ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. పెమా నిబంధనలను ఉల్లఘించినట్టు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం.
31వరకూ అరెస్ట్ చేయొద్దు
ఫార్ములా ఈ-కారు రేస్ కేటీఆర్ ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న కేటీఆర్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్ ను ఈనెల 30 వరకు ఆరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసుపై కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కేటీఆర్ ను ఈనెల 31 వరకు ఆరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.