Munugode Bypoll 2022: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు, ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు, నవంబర్ 3న పోలింగ్, 6న కౌంటింగ్
నేటి నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం పేర్కొంది.
Munugode, Oct 7: నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ (Munugode Bypoll 2022) విడులైంది. నేటి నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం పేర్కొంది. ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, 15న నామినేషన్ల పరిశీలిస్తామని తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు గడువు ఉంటుందని వెల్లడించింది. ఇక నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్, అదే నెల 6న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
చండూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. శని, ఆదివారం నామినేషన్ల దాఖలుకు సెలవు ఉంటుంది. ఈనెల 14వ తేదీ వరకు జరగనున్న నామినేషన్ల స్వీకరణకు 30 మంది పోలీసులు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. చండూరు పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నామినేషన్ వేసే అభ్యర్థుల వెంట అయిదుగురికి మాత్రమే రిటర్నింగ్ కార్యాలయంలోకి అనుమతి ఉంటుంది.
మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల, నవంబర్ 3న ఉప ఎన్నికల పోలింగ్, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు
మనుగోడులో అభ్యర్థుల నామినేషన్ ఖరారు అయింది. అక్టోబర్ 10న బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. 14న కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేయనున్నారు. 13 లేదా 14వ తేదీన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసే అవకాశం ఉంది.