Fake Judge Arrest: జైలు నుంచి వచ్చి జడ్జీగా అవతారమెత్తిన కేటుగాడు, నేను న్యాయమూర్తిని మీ భూసమస్యలు పరిష్కరిస్తానంటూ రూ. 10లక్షలు వసూలు చేసిన వ్యక్తి అరెస్ట్
వారి ఇద్దరి నుంచి పిస్టల్, రెండు మ్యాగజైన్స్, ఫోర్‌వీలర్ వాహనం, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad, July 28: జిల్లా జడ్జి పేరుతో (Fake judge) మోసాలకు పాల్పడుతున్న వ్యక్తితోపాటు, ఆయనకు భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్న మరోవ్యక్తిని శుక్రవారం మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ (SOT) పోలీసులు, ఉప్పల్ (Uppal) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఇద్దరి నుంచి పిస్టల్, రెండు మ్యాగజైన్స్, ఫోర్‌వీలర్ వాహనం, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ జానకి వివరాలు వెల్లడించారు. వేములవాడకు చెందిన నామల నరేందర్(31) రామంతాపూర్ భరత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. వ్యసనాలకు అలవాటు పడిన నరేందర్ సులువుగా డబ్బు సంపాదించాలనే అక్రమాలకు పాల్పడేవాడు. పలు ఆస్తుల కేసుల్లో నేరస్థుడిగా జైలుకు వెళ్లాడు. జైలు నుంచి విడుదల అనంతరం ఖమ్మం వెళ్లాడు. అక్కడ అసిస్టెంట్ జిల్లా జడ్జిగా చెప్పుకుంటూ భూవివాదాలను పరిష్కరిస్తానని చెప్పి బాధితుల నుంచి డబ్బులు వసూళ్లు చేశాడు. పలు కేసుల్లో మళ్లీ జైలుకు వెళ్లాడు.
జైలు నుంచి విడుదలైన నరేందర్.. హైదరాబాద్‌కు (Hyderabad) మకాం మార్చాడు. అమీర్‌పేటలోని వెబ్ డిజైనర్ సంతోష్ సహాయంతో నకిలీ ప్రొఫైల్ రూపొందించాడు. వనస్థలిపురానికి చెందిన గార్లపాటి సోమిరెడ్డికి చెందిన భూమి సమస్యలు పరిష్కరించేందుకు రూ.10 లక్షలను తీసుకున్నాడు. భూమి మ్యూటేషన్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. సమస్యలు పరిష్కరించకపోవడంతో నరేందర్‌పై సోమిరెడ్డి ఒత్తిడి పెంచాడు. అయితే మాజీ సైనికుడు చిలకం మధుసూదన్‌రెడ్డిని గన్‌మెన్‌గా నియమించుకున్నాడు. ఈ మేరకు ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేస్తున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఎస్‌ఓటీ గిరిధర్, మల్కాజిగిరి ఏసీపీ నరేష్ రెడ్డి, ఎస్‌ఓటీ ఏసీపీ వాసు, సీఐలు గోవిందరెడ్డి, రాములు, ఎస్సైలు వాసుదేవ్, పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.