Medaram Jatara: గద్దెల మీదకు సమ్మక్క తల్లి, జాతరలో కీలక ఘట్టం పూర్తి, మొక్కులు సమర్పించుకుంటున్న భక్తులు, కోలాహలంగా మేడారం
చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి (Sammakka) గద్దె మీదకు చేరింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గిరిజన పూజారులు. ఇప్పటికే సారక్క(Sarakka), పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలనెక్కి భక్తులకు దర్శనమిస్తుండగా కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని ఆదివాసీల సంప్రదాయం ప్రకారం చిలుకలగుట్ట నుంచి తీసుకొచ్చారు.
Warangal, Feb 17: మేడారం జాతరలో (Medaram Jatara) అసలైన ఘట్టం మొదలైంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి (Sammakka) గద్దె మీదకు చేరింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గిరిజన పూజారులు. ఇప్పటికే సారక్క(Sarakka), పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలనెక్కి భక్తులకు దర్శనమిస్తుండగా కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని ఆదివాసీల సంప్రదాయం ప్రకారం చిలుకలగుట్ట నుంచి తీసుకొచ్చారు. ఊరిగింపు, భక్తుల కోలాహలం నడుమ మేడారంలోని గద్దె మీద ప్రతిష్టించారు. సమ్మక్క తల్లిని తీసుకువచ్చే సమయంలో.. ఆనవాయితీ ప్రకారం ములుగు జిల్లా ఎస్పీ గాల్లోకి 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మకు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సమ్మక్కకు స్వాగతం పలికారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli dayakar rao), ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran reddy).
జాతరను తిలకించేందుకు.. మొక్కులు తీర్చుకునేందుకు .. భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర నుంచి గోండులు, కోయలు, లంబాడాలు, మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు, రత్తిసాగర్ గోండులు, ఒడిశా నుంచి సవర ఆదివాసీలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఇంకా లక్షల మంది గిరిజనేతరులు మేడారం బాట పట్టారు. గ్రామాల నుంచి వారం కింద మొదలైన ఎడ్ల బండ్లు వన దేవతల సన్నిధికి చేరుకుంటున్నాయి.
మూడు రోజుల పాటూ జరిగే మేడారం జాతరలో బుధవారం నాడు సారలమ్మ భక్తుల కోలాహలం మధ్య గద్దె మీదకు చేరుకుంది. ఇరువురు దేవతల రాకతో భక్తులంతా శుక్రవారం మొక్కులు సమర్పించుకోనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదేరోజు మేడారం వెళ్లనున్నారు. శనివారం నాడు అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. అటు సంద్రంలా సాగివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా .. అధికారులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. వేల మంది పోలీసులు, వందల సంఖ్యలో సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షిస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ శుక్రవారం మేడారం జాతరకు హాజరై తల్లులకు మొక్కులు చెల్లించుకోనున్నారు. సీఎం టూర్ ఏర్పాట్లను మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.