CM KCR Comments On Floods: గోదావరి వరదల వెనుక విదేశీ కుట్రలు, తెలంగాణ వరదలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
గోదావరి వరదల వెనుక విదేశీ కుట్రలు ఉన్నట్లు అనుమానం కల్గుతుందన్నారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతితో వరదలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ వరదలసై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి వరదల వెనుక విదేశీ కుట్రలు ఉన్నట్లు అనుమానం కల్గుతుందన్నారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతితో వరదలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో లేహ్, ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతాల్లో కుట్రలు చేస్తున్నట్లు సమాచారం వస్తోందన్నారు.
వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వచ్చే రెండు నెలలు కుటుంబానికి 20 కిలోల చొప్పున బియ్యం అందజేస్తామని చెప్పారు. అప్పుడే ప్రమాదం తప్పిందని అనుకొవద్దని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈనెల 29 వరకు ప్రతి రోజూ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారని వెల్లడించారు. భద్రాచలం, పినపాకలో వరద ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వరద సమస్యకు పరిష్కారానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. 90 ఫీట్ల వరద వచ్చినా.. ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎత్తైన ప్రదేశాల్లో మూడు వేల ఇళ్లతో కాలనీ నిర్మిస్తామని చెప్పారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే రద్దు చేసుకున్న సీఎం కేసీఆర్.. రోడ్డు మార్గం ద్వారా భద్రాచలానికి చేరుకున్నారు. గోదావరి నదికి సీఎం శాంతి పూజ చేశారు. కరకట్ట ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లారు. ఆదివారం ఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరిన సీఎం కేసీఆర్ ఏటూరునాగారం మీదుగా భద్రాచలం చేరుకున్నారు.