Telangana Phone-Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు, చంచలగూడ జైలుకు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

ఈ కేసులో ఇప్పటికే కొందరు అధికారులను అరెస్ట్ చేయగా.. తాజాగా అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

Former DCP Radhakishan Rao (Photo-Video Grab)

Hyd, Mar 29: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే కొందరు అధికారులను అరెస్ట్ చేయగా.. తాజాగా అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. గతంలో ఆయన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పని చేశారు. రిటైర్ అయ్యాక అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పని చేశారు.

ఎస్ఐబీలో పని చేసిన సమయంలో సస్పెండైన డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్ రావు బృందం అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. గురువారం ఉదయం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయనను దర్యాఫ్తు బృందం విచారించింది. ఈరోజు సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు.  జడ్జి రిమాండ్ విధించడంతో రాధాకిషన్‌రావును చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలన విషయాలు బయటకు, కీలక వికెట్‌ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు, జైల్లో చిప్పకూడు తప్పదన్న సీఎం రేవంత్ రెడ్డి

ఈ కేసులో ఇప్పటికే అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న అరెస్ట్ కాగా.. వారిద్దరు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా వారిద్దరికి ఏప్రిల్ 2వరకు కోర్టు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో కీలకంగా ఉన్న మరో నిందితుడు ప్రణీత్‌రావును కస్టడీకి ఇచ్చేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది.