Former DCP Radha Kishan Rao Arrested (Photo-Video Grabs)

Former DCP Radha Kishan Rao Arrested: రాష్ట్ర స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (SIB) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముఖ్య అనుమానితుడిగా ఉన్న హైదరాబాద్‌ టాస్క్‌­ఫోర్స్‌ మాజీ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (OSD) పి.రాధాకిషన్‌రావును సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. గురువారం ఉదయం బంజారాహిల్స్‌ ఠాణాకు వచ్చిన ఆయన్ని వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ నేతృత్వంలోని దర్యాప్తు బృందం రాత్రి వరకు విచారించింది. అనంతరం అరెస్ట్‌ (Former DCP Radha Kishan Rao Arrested) చేసింది.శుక్రవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని పంజగుట్ట పోలీసులు చెప్పారు.

రాధాకిషన్‌రావును విచారిస్తున్న సమయంలో ఠాణా గేట్లు మూసేసి గోప్యత పాటించారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ)లో పనిచేసిన సమయంలో డీఎస్పీ(సస్పెండెడ్‌) దుగ్యాల ప్రణీత్‌రావు ఫోన్‌ట్యాపింగ్‌ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్‌రావు బృందం అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలున్నాయి.  బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జోరందుకున్న వలసలు, చెక్ పెట్టేందుకు కేసీఆర్ సరికొత్త ఎత్తుగడ, పార్టీ మార్పుపై బీఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే..

ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా ఇద్దరు అదనపు ఎస్పీలతోపాటు రాధాకిషన్‌రావు, విశ్రాంత ఐజీ ప్రభాకర్‌రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌రావు ఇళ్లలో కొద్దిరోజుల క్రితం సోదాలు నిర్వహించారు. అనంతరం ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్‌ చేయగా.. మిగిలిన ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరు ముగ్గురూ విదేశాలకు వెళ్లినట్లు భావించిన పోలీసులు లుక్‌అవుట్‌ నోటీస్‌లు జారీ చేశారు.

వీరితో పాటుగా గతంలో టాస్క్ ఫో­ర్స్, ఎస్‌ఐబీల్లో పని చేసిన రాచకొండ ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. ట్యాపింగ్‌తో ( పాటు బలవంతపు వసూళ్లలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు. సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రశ్నిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు అటు ప్రభాకర్‌రావు, ఇటు రాధాకిషన్‌రావులకు సన్నిహితుడని తెలుస్తోంది.

హన్మకొండలో మాజీ మంత్రి కేటీఆర్‌ పై కేసు నమోదు.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన హన్మకొండ పోలీసులు

ప్రభాకర్‌రావు ఉమ్మడి నల్లగొండ ఎస్పీగా పని చేసినప్పుడు ఇతను చౌటుప్పల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేశాడు. రాధాకిషన్‌రావు హయాంలో హైదరాబాద్‌ టాస్‌్కఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌గానూ విధులు నిర్వర్తించాడు. ఇక్కడ నుంచి మళ్లీ ప్రభాకర్‌రావు నేతృత్వం వహిస్తున్న ఎస్‌ఐబీలోకే వెళ్లాడు. ఇటీవల అరెస్టు అయిన అదనపు ఎస్పీ తిరుపతన్న టీమ్‌లో చురుకుగా వ్యవహరించాడని సిట్‌ చెప్తోంది. ఈ రెండు విభాగాల్లోనూ గట్టు మల్లు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్, గతంలో ప్రణీత్ రావుతో కలిసి పనిచేసిన వారి ఇండ్లలో సోదాలు, రాజకీయ, వ్యాపార ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ కీలక సమాచారం సేకరణ

గతంలో ముఖ్యమంత్రి భద్రత విభాగంలో అదనపు ఎస్పీగా పని చేసిన రాధాకిషన్‌రావు నాన్‌–క్యాడర్‌ ఎస్పీగా పదోన్నతి పొంది, 2017 నవంబర్‌ 3న హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. 2020 ఆగస్టు 31న ఈయన పదవీ విరమణ చేసినా.. మూడేళ్ల పాటు ఓఎస్డీగా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఆగస్టు 31తో ఆ గడువు ముగిసింది.

అయితే గడువును ప్రభుత్వం మరో రెండేళ్లపాటు పొడిగించింది. 2018 నాటి ఎన్నికల సమయంలో రాధాకిషన్‌రావు డీసీపీ హోదాలో విధులు నిర్వర్తించారు. ఒక అధికారి ఒకే పోస్టులో రెండు ఎన్నికలకు పని చేయకూడదనే నిబంధన ఉంది. దీంతో పాటు ఆయన అధికార పార్టీకి సన్నిహితంగా ఉన్నారనే ఆరోపణలూ వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ గత ఏడాది అక్టోబర్‌ 20న ఆయనపై బదిలీ వేటు వేసింది. అప్పటి నుంచి విధులకు దూరంగా ఉన్న ఆయన.. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయి, కొత్త సర్కారు ఏర్పడుతుండటంతో గత ఏడాది డిసెంబర్‌ 4న రాజీనామా చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌ కేసు, మాజీ SIB డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్, విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావుతోపాటు ఆయన బృందంపై పలు ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ పెద్దలు తాము లక్ష్యంగా చేసుకున్న ప్రత్యర్థులను రాజకీయంగా తమకు అడ్డు తొలగించుకునే లేదా దారికితెచ్చే బాధ్యతను టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించేవారని ప్రతిపక్షాలు బహిరంగంగానే ఆరోపించేవి. రాధాకిషన్‌రావుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలుమార్లు ఆరోపణలు చేశారు. రాధాకిషన్‌రావు మల్కాజిగిరి ఏసీపీగా ఉన్న సమయంలో ఓ కాంగ్రెస్‌ నేత ఆత్మహత్యకు కారకులయ్యారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. విచారణ అనంతరం ఆ కేసు నుంచి బయటపడ్డారు.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టయి చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఐదు రోజుల పోలీస్‌ కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచి ఏప్రిల్‌ 2 వరకు కస్టడీ విధించింది. ప్రణీత్‌రావును పోలీస్‌ కస్టడీకి ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 12న అరెస్ట్‌ చేశారని, ఇప్పటికే 14 రోజుల గడిచిన నేపథ్యంలో పోలీస్‌ కస్టడీకి ఇవ్వొద్దంటూ ప్రణీత్‌రావు తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో పోలీసుల పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది.

ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి .. భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నారు. ట్యాపింగ్‌ చేసి వింటే ఏమవుతుందని కేటీఆర్‌ మాట్లాడుతున్నారు. ట్యాపింగ్‌ చేసిన వారు జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుంది. కేటీఆర్‌ బరితెగించి మాట్లాడుతున్నారు.. తగిన ఫలితం ఉంటుంది. ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది.. తప్పకుండా చర్యలు ఉంటాయి. అధికారులకు ఆ రోజే చెప్పా.. వినలేదు. ఇవాళ జైలుకు వెళ్తే.. అటు వైపు చూడటం లేదు. ఓటు విలువ తెలుసు.. అందుకే ఢిల్లీ నుంచి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశా. లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నుంచి వంశీచంద్‌రెడ్డి, నాగర్‌ కర్నూల్‌ నుంచి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.