CM Revanth on Friendly policing: బాధితులతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్, నేరస్తులకు కాదు..తేల్చిచెప్పిన సీఎం రేవంత్
హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్లు,ఎస్పీలతో నిర్వహించిన సదస్సులో మాట్లాడిన సీఎం రేవంత్
Hyd, July 17: ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది బాధితులతోనే కానీ నేరస్తులతో కాదనే విషయం గుర్తుంచుకోవాలని తేల్చిచెప్పారు సీఎం రేవంత్. హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్లు,ఎస్పీలతో నిర్వహించిన సదస్సులో మాట్లాడిన సీఎం రేవంత్...అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీపడొద్దని తేల్చిచెప్పారు.
ముఖ్యంగా డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాంతి భద్రతల కాపాడటంలో తీసుకోవలసిన చర్యలపై కీలక సూచలను చేసిన రేవంత్.... పోలీసులు రహదారులపై కనిపించాలని, పీరియాడికల్ క్రైమ్ రివ్యూలు చేయాలని తేల్చిచెప్పారు.
కమిషనర్లు, ఎస్పీలు మొదలు ఎస్ హెచ్ వోల వరకు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. గతేడాది కన్నా నేరాలు తగ్గాయని పోలీసు అధికారులు వివరించగా, వాటిని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే విధంగా అధికారులు పనిచేయాలని తెలిపారు రేవంత్.
కల్తీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. కొన్నిసార్లు కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తారని, అటువంటివి జరగకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. కలెక్టర్లు విధిగా పాఠశాలలను తనిఖీ చేయాలని...డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు తరచూ పాఠశాలలను సందర్శించాలన్నారు. ముఖ్యమంత్రి అల్పాహారం పథకం పేరిట బ్రేక్ ఫాస్ట్‌ను అందించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని తీసుకొచ్చారు.
అటవీ భూముల్లో పండ్ల మొక్కలు నాటడాన్ని ప్రోత్సహించి తద్వారా గిరిజనులకు ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని... ప్రాజెక్టు కట్టలు, కాలువ గట్టులు, రహదారుల వెంట తాటి, ఈత చెట్లు నాటాలని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతిగృహాలు ఒకేచోట ఉండేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటునకు స్థలాలు ఎంపిక చేయాలన్నారు.