Hyderabad Rains: హైదరాబాద్ లో మరో 4 రోజులపాటు భారీ వర్షాలు, వడగండ్ల వానలు, ఆరెంజ్ అలర్ట్ జారీ
పలుచోట్ల ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ-హెచ్ హెచ్చరించింది.
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారత వాతావరణ శాఖ - హైదరాబాద్ (IMD-H) ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ-హెచ్ హెచ్చరించింది. మేడ్చల్, ఉమ్మడి నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరోవైపు హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈరోజు ఉదయం నుంచి నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, హిమాయత్‌నగర్, నారాయణగూడ, చిక్కడపల్లి, ఏఎస్ రావునగర్, కుషాయిగూడ, నాగారం, కీసర, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, చర్లపల్లి, నాంపల్లి, లక్డీకపూల్, మాసబ్‌ట్యాంక్, మెహదీపట్నం, మాణిక్‌చౌకీ, టోలీచౌకిలో భారీ వర్షం కురిసింది. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి మోకాళ్లలోతు నీరు చేరింది. పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే స్టేషన్‌లోని రైల్వే అండర్‌పాస్‌లో వర్షపు నీరు నిలిచింది.