Justice For Disha: దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్, ఏర్పాట్లు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం, వీలైనంత త్వరలో నిందితులకు శిక్ష ఖరారు

ఇది ఏర్పాటైన తర్వాత రోజూవారీ పద్ధతిలో ప్రత్యేకంగా ఈ కేసు విచారణను పూర్తి చేస్తారు, నిందితులకు శిక్షలు ఖరారు కాగానే తీర్పుకనుగుణంగా శిక్షలు అమలు చేయడం జరుగుతుంది....

High Court of Telangana|| Photo Credits: Wikimedia Commons

Hyderabad, December 4:  శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో అత్యాచారం, హత్యకు గురికాబడ్డ దిశ (Disha) కేసులో ఇక విచారణ వేగవంతం కానుంది. ఈ కేసుకు సంబంధించి బాధితురాలి కుటుంబానికి కొంత ఊరట కలిగించే ప్రయత్నంలో భాగంగా కేసు విచారణ వేగంగా పూర్తిచేసి నిందితులకు శిక్షలు ఖరారు చేసేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు (Fast-track court) ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది.  ఈ ప్రతిపాదనకు రాష్ట్ర హైకోర్ట్ (High Court) బుధవారం ఆమోదం తెలిపింది.

హైకోర్ట్ ఆమోదం నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. ఇది ఏర్పాటైన తర్వాత రోజూవారీ పద్ధతిలో ప్రత్యేకంగా ఈ కేసు విచారణను చేపట్టి, తక్కువ కాలంలో విచారణ పూర్తిచేస్తారు.  నిందితులకు శిక్షలు ఖరారు కాగానే తీర్పుకనుగుణంగా శిక్షలు అమలు చేయడం జరుగుతుంది.

దిశ హత్యాచారం ఘటన సందర్భంగా దేశవ్యాప్తంగా తీవ్రఆగ్రహావేశాలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసును సత్వరమే విచారించి నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

గతంలో వరంగల్ లో ఓ చిన్నారి ఘటన విషయంలో కూడా ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు కేసును సిఫారసు చేయడంతో 56 రోజుల్లోనే ఆ కేసు  విచారణ పూర్తయి తీర్పు వెలువడింది. ఈ క్రమంలో ఇప్పుడు దిశ కేసు ఎన్ని రోజుల్లో విచారణ పూర్తి చేస్తారో, ఎలాంటి శిక్షలు విధిస్తారనేదానిపై ఉత్కంఠత నెలకొంది.