shamshabad Murder Case Cops change victim's name to 'Disha and telangana-cm-kcr-responds-on-justice-for-disha (photo-PTI)

Hyderabad, December 2: శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, దహనం(shamshabad Murder Case) కేసులో దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అవసరమైతే నడిరోడ్డులో కాల్చిపడేయాలని లేకుంటే ఉరి తీయాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా గళమెత్తుతున్నారు.

ఈ కేసులో బాధితురాలి పేరుతో సోషల్ మీడియాలో (Social Media) కథనాలు రావడం, ఫోటోలతో సహా ప్రచురించడంతో మీడియాపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ (Police commissioner VC Sajjanar)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై బాధితురాలి పేరును దిషా(Disha)గా పిలవాలని తెలంగాణా పోలీసులు సూచించారు. ఇందుకు సంబంధించి పోలీసులు అధికారికంగా పేరును మీడియాకు విడుదల చేశారు.

ఇదివరకే నిర్భయ చట్టంలో బాధితురాలి పేరుతో పాటు.. కుటుంబ సభ్యుల వివరాలను బయట పెట్టవద్దని సుప్రీం కోర్టు(Supreme Court) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ బాధితురాలి పేరును కూడా మార్చాలని నిర్ణయించారు. ఇక మీదట ‘దిషా’ పేరు మీదే వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఏ మీడియా కూడా బాధితురాలి లేదా ఆమె కుటుంబ సభ్యుల ఫోటోలు, వివరాలు వెల్లడించొద్దని పోలీసులు సూచించారు. బాధితురాలికి న్యాయం జరగడం కోసం జస్టిస్‌ ఫర్‌ దిషా (Justice for Disha) పేరుతో పిలవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ సూచించారు. ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులను ఆయన ఒప్పించారు.

హత్యాచార ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్

జస్టిస్ ఫర్ దిషా హత్యాచార ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR)స్పందించారు. ఈ దారుణ అమానుషమైన దుర్ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి రాత్రి సమయంలో మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వద్దని చెప్పారు. మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

తమ మొబైల్‌ ఫోన్‌లో డయల్ 100 (Dial 100) నెంబర్ తప్పక ఉండాలని సూచించారు. దీంతో పాటుగా దిషా హత్య కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు(fast track court)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇటీవల వరంగల్ లో ఓ మైనర్ బాలిక హత్య విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడింది. అదే తరహాలో సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.