BJP Corporators Protest: 14 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు, హైదరాబాద్ వాటర్ బోర్డు కార్యాలయంలో రణరంగం, బీజేపీ కార్పొరేటర్ల మెరుపు ధర్నా
సివరేజ్ నిర్వహణ చేపట్టడం లేదని, పూడిక తీయట్లేదని బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు మెరుపు ధర్నాకు దిగారు. డ్రైనేజీల నుంచి తొలగించిన వ్యర్థాలను తీసుకొచ్చి వాటర్ బోర్డు కార్యాలయంలో పారబోశారు.
Hyd, May 3: హైదరాబాద్‌లోని GHMC వాటర్‌బోర్డు కార్యాలయం మంగళవారం ఉదయం రణరంగంగా మారింది. సివరేజ్ నిర్వహణ చేపట్టడం లేదని, పూడిక తీయట్లేదని బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు మెరుపు ధర్నాకు దిగారు. డ్రైనేజీల నుంచి తొలగించిన వ్యర్థాలను తీసుకొచ్చి వాటర్ బోర్డు కార్యాలయంలో పారబోశారు. ఎండీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. ఆఫీస్ ముందు బైఠాయించిన కార్పొరేటర్లు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
సిటీలో సీవరేజీ పనులు చేయాలని ఎన్నిసార్లు చెబుతున్నా పట్టించుకోవడం లేదని, ఎక్కడ చూసినా రోడ్లపై మురుగు పారుతోందని, మంచి నీరు కలుషితమై జనం ఆస్పత్రుల పాలవుతుంటే వాటర్బోర్డ్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. డ్రైనేజీలను క్లీన్ చేసిన తర్వాత ఆ వ్యర్థాలను తొలగించకుండా రోడ్డుపై వదిలేస్తున్నారని మండిపడ్డారు.
డ్రైనేజీల్లో నుంచి సిల్ట్ తీసి నెలల తరబడి ఇండ్ల ముందు వదిలేస్తే ఆ కంపు భరించలేక జనం రోగాల బారిన పడుతున్న విషయం అధికారులకు తెలియాలనే ఇలా చేసినట్లు కార్పొరేటర్లు పేర్కొన్నారు. కలాసిగూడలో ఇటీవల నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన బాలిక మౌనిక మృతికి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు, కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదంతో తీవ్ర ఉదిక్త్రత నెలకొంది. వాటర్‌బోర్డు కార్యాలయ మొదటి అంతస్తుకు చేరిన పలువురు కార్పొరేటర్లను బలవంతంగా పోలీసులు బయటకు తీసుకొచ్చారు. మల్కాజిగిరి కార్పొరేటర్‌ను ఎత్తుకొస్తుండగా తల మెట్లకు తాకింది. పోలీసులు దాడి చేశారంటూ ఆ ప్రజాప్రతినిధి. వాటర్ బోర్డు కార్యాలయం ఎదుట కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సఫాయి కార్మికులకు మేడే బొనాంజా, లక్ష మంది కార్మికులకు జీతం పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం
ధర్నా చేస్తున్న బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించారు. దీంతో పోలీసుల వాహనాలు ముందుకు కదలకుండా మహిళా కార్పొరేటర్లు అడ్డగించారు.దాంతో వారిని కూడా అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.
వాటర్బోర్డ్ ఎండీ దానకిశోర్‌ను కలిసేందుకు ఆఫీసులోకి వెళ్లే ప్రయత్నం చేసిన కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. దీంతో కార్పొరేటర్లు, నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంపల్లి, గాంధీనగర్ పోలీస్స్టేషన్లకు తరలించారు.
బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ఖైరతాబాద్‌లోని వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో డ్రైనేజీ వ్యర్థాలను పారబోయడంతో పాటు అక్కడ ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. దీంతో కార్యాలయ ప్రవేశమార్గం మట్టి, వ్యర్థాలతో దుర్గంధంగా మారింది. వాటర్‌బోర్డు అధికారుల ఫిర్యాదుతో 14 మంది కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.