HYD Honor killing: మాకు రక్షణ కల్పించండి, సీపీ సజ్జనార్‌ను కలిసిన హేమంత్ భార్య అవంతి, పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన సైబరాబాద్ సీపీ సజ్జనార్, 24 గంటల భద్రత ఏర్పాటు చేయాలని చందానగర్ పోలీసులకు ఆదేశాలు
కాగా హేమంత్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని అవంతి బుధవారం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను (Cyberabad police commissioner VC Sajjanar) కలిశారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని వినతి పత్రం అందించారు. హేమంత్ హత్యతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేయాలని అవంతి ఈ సందర్భంగా సీపీని కోరారు.
Hyderabad, Sep 30: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు వేగం పెంచారు. ఈ కేసు విచారణ సాగుతుండగా హేమంత్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని అవంతి బుధవారం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను (Cyberabad police commissioner VC Sajjanar) కలిశారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని వినతి పత్రం అందించారు. హేమంత్ హత్యతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేయాలని అవంతి ఈ సందర్భంగా సీపీని కోరారు.
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు (Hemanth Wife Avanthi And Family Members) పూర్తి భద్రత కల్పిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హామీనిచ్చారు. హేమంత్ ఇంటివద్ద 24 గంటల భద్రత ఏర్పాటు చేయాలని చందానగర్ పోలీసులకు (Chandanagar Police) ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒక మహిళా కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలన్నహేమంత్ భార్య అవంతి విజ్ఞప్తి మేరకు సజ్జనార్ స్పందించారు. దీంతోపాటు హేమంత్ కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఆయన తెలిపారు.
హేమంత్ పరువు హత్య కేసులో (HYD Honor killing) ఇప్పటివరకు 21 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితులు యుగేంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డిని పోలీసులు ఆరు రోజుల పాటు విచారించనున్నారు. కేసు విచారణలో భాగంగా అవంతిక తండ్రి లక్ష్మారెడ్డి, యుగేందర్ రెడ్డిలను గచ్చిబౌలి పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గోపన్ పల్లి వద్ద హేమంత్ కిడ్నాప్ స్థలం నుంచి సంగారెడ్డిలో హత్యా స్థలం వరకు నిందితులను తీసుకెళ్లి పోలీసులు సీన్ రీ కన్స్‌ట్రక్షన్ చేయనున్నారు. ప్రధాన కుట్రదారు లక్ష్మారెడ్డి, అమలు చేసింది యుగంధర్ రెడ్డి అని పోలీసులు నిర్ధారించారు. సుపారీ కిల్లింగ్‌లో ఇంకా ఎవరి హస్తం ఉందనే కోణంలో విచారిస్తున్నారు.
అవంతిని ప్రేమించి పెళ్లిచేసుకున్న హేమంత్ ఈ నెల 25న అత్యంత దారుణ పరిస్థితుల్లో హత్యకు గురైన విషయం విదితమే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసులో మొత్తం 22 మంది నిందితులను గుర్తించిన పోలీసులు.. దీనిని ‘పరువు హత్య’ గా తేల్చారు. పక్కా పథకం ప్రకారమే, తమ పరువు తీశాడనే పగతోనే అవంతి తల్లిదండ్రులు అతడిని హత్య చేయించినట్లు పేర్కొన్నారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే లోకల్ గ్యాంగ్‌తో కలిసి అతడి హతమార్చినట్లు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మామ యుగంధర్ తమ ముందు అంగీకరించినట్లు వెల్లడించారు.
హేమంత్ హత్య కేసులో నిందితుల తొలిరోజు కస్టడీ ముగిసింది. పోలీసుల విచారణలో హత్యకు గల కారణాలను నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. అవంతి ప్రేమ విషయం తెలిసే కట్టడి చేశామని, మా నుంచి తప్పించుకుని హేమంత్‌ను ప్రేమ వివాహం చేసుకుందని నిందితుడు లక్ష్మారెడ్డి తెలిపినట్లు సమాచారం. వివాహం చేసుకున్నట్లు మాకు పోలీసుల నుంచి సమాచారం వచ్చింది. 15 ఏళ్లుగా బామ్మర్ది యుగేంధర్‌తో మాటలు లేవు. హేమంత్, అవంతి విషయంపై తిరిగి మాట్లాడాల్సి వచ్చింది. ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావించే కుటుంబం మాది. మేము ఉంటున్న కాలనీలో మా కుటుంబానిదే ఆధిపత్యం. అవంతి ప్రేమ విషయంతో కాలనీలో తలదించుకోవాల్సి వచ్చింది’అని లక్ష్మారెడ్డి విచారణలో చెప్పినట్టు సమాచారం.