Honor Killing 2: తెలంగాణలో 'అమృత- ప్రణయ్- మారుతీరావు' ఘటన తరహాలో మరో ఘటన. ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు యువకుడిని దారుణ హత్య చేయించిన యువతి తండ్రి
Hemanth and Avanthi Marriage Photo | Image twitter

Hyderabad, September 25: తెలంగాణలో రెండేళ్ల క్రితం జరిగిన ప్రణయ్- అమృత- మారుతీరావులకు సంబంధించిన హత్యోదంతం నేటికీ కళ్లముందు కదలాడుతూ సజీవంగా ఉంది. తన కూతురు అమృత ఒక హరిజన కులానికి చెందిన ప్రణయ్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నందుకు తన పరువుకు భంగంగా భావించిన అమృత తండ్రి మారుతీరావు తన డబ్బు, పలుకుబడిని ఉపయోగించి ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించిన తీరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ అలాంటి ఓ ఘటనే, అదే తరహాలో మరో పరువు హత్య హైదరాబాద్ శివారుల్లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, చందానగర్ కు చెందిన హేమంత్ షెట్టి అనే 28 ఏళ్ల యువకుడు, తన ఇంటికి సమీపంలోనే ఉండే చిన్ననాటి స్నేహితురాలు అవంతి రెడ్డి ఇద్దరు గత 8 సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు ఆమెను నిర్బంధంగా బంధించి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో గత జూన్ 10వ తేదీన యువతి ఇంటి నుంచి బయటకు వచ్చేయడంతో ఇద్దరు పారిపోయి సమీపంలోని సంతోషి మాతా ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ బీహెచ్ఈఎల్ సమీపంలో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు.

అప్పట్నించి యువతి తండ్రి లక్ష్మారెడ్డి అల్లుడు హేమంత్ పై ప్రతీకారం పెంచుకున్నాడు. హేమంత్ ఓ మధ్య తరగతికి చెందిన వ్యక్తి, లక్ష్మారెడ్డిది సంపన్న కుటుంబం. ఈ నేపథ్యంలో ఆస్తి కోసమే హేమంత్ తన కూతురును ట్రాప్ చేశాడని లక్ష్మారెడ్డి భావించాడు. పెళ్లయిన తర్వాత కూడా కూతురు అవంతిని వెనక్కి వచ్చేయమని, అతడి వద్ద ఇళ్లు గానీ, ఎలాంటి ఆస్తి పాస్తులు లేవని వేరే మంచి సంబంధం చూసి పెడతామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కూతురు వినకపోవడంతో ఇక లక్ష్మారెడ్డి తన బంధువుల (అవంతి మేనమామలు)తో కలిసి హేమంత్ ను హతమార్చాలని ప్లాన్ వేశారు.

కిరాయి గూంఢాలకు సుపారీ ఇచ్చి గురువారం సాయంత్రం హేమంత్- అవంతి ఉన్న ఫ్లాట్ లోకి చొరబడి వారిని ఈడ్చుకుపోయారు. వారిని ఓ కారులో ఎక్కించుకొని తీసుకెళ్తుండగా అవంతికి అనుమానం వచ్చి కారు నుంచి దూకేసింది. అదే సమయంలో హేమంత్ పేరేంట్స్ కి, పోలీసులకు సమాచారం అందించింది. అయితే పోలీసులు హేమంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. శుక్రవారం ఉదయం హేమంత్ శవమై కనిపించాడు.

దీంతో హేమంత్ తల్లిదండ్రులు, భార్య అవంతి శోక సంద్రంలో మునిగిపోయారు. ఎన్నో ఆశలు పెట్టుకొని గారాబంగా పెంచుకున్న తమ కొడుకును అన్యాయంగా చంపేశారని హేమంత్ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. "గతంలో మారుతీరావు ఘటన జరిగినా నా తండ్రి మూర్ఖంగా ప్రవర్తించాడు. కూతురి జీవితం నాశనం చేసిన మారుతీరావు ఏమయ్యాడు? నన్ను వదిలేసి ఉంటే నా బ్రతుకేదో నేను బ్రతికేదాన్ని. ఇప్పుడు నా తల్లిదండ్రులు నాకు చచ్చిపోయారు. నాకు అత్తమామలు తప్ప ఎవరూ లేరు" అని అవంతి ఆవేదన వ్యక్తం చేసింది.

హేమంత్ కు సినిమాలంటే ఆసక్తి, గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ మరియు ఇండిపెండెంట్ సినిమాల్లో నటించాడు.