Hyderabad Mayor: హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు సోకిన కరోనావైరస్, లక్షణాలు బయటపడకపోయినా పాజిటివ్‌గా నిర్ధారణ
దీంతో మేయర్ రామ్మోహన్ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చినట్లు తెలిసింది....
Hyderabad, July 26: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనావైరస్ విజృంభిస్తోంది. తాజాగా హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కరోనావైరస్ బారినపడ్డారు. మేయర్‌లో కరోనా లక్షణాలు లేకపోయినా, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మేయర్ రామ్మోహన్ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చినట్లు తెలిసింది.
బొంతు రామ్మోహన్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో ఆయన డ్రైవర్, ఇతర సిబ్బందికి పాజిటివ్ వచ్చినపుడు ఆయనకు కూడా పరీక్షలు నిర్వహించగా అప్పుడు రిపోర్ట్స్ నిగెటివ్ అని వచ్చాయి. అయితే తన విధుల్లో భాగంగా మేయర్ ఇటీవల నగరంలో పర్యటిస్తున్నపుడు ఓ టీ స్టాల్ వద్ద ఛాయ్ తాగారు, కాగా ఆ ఛాయ్ వాలాకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో మేయర్ బొంతు రామ్మోహన్‌కు శనివారం మరోసారి కొవిడ్19 పరీక్షలు నిర్వహించారు. ఈసారి మాత్రం పాజిటివ్ అని తేలింది. కరోనా కేసుల్లో 'పొదుపు' పాటిస్తున్న తెలంగాణ
ప్రస్తుతం మేయర్ ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు తెలిపారు. స్వీయ నిర్బంధంలో ఉంటూనే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) చేత నిర్వహించబడుతున్న వివిధ పనుల పురోగతిని వీడియో సమావేశాల ద్వారా మేయర్ సమీక్షిస్తున్నారు.
కొవిడ్ -19 నుంచి కోలుకున్న వారందరూ తమ ప్లాస్మాను దానం చేయాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో వర్షాలు కురుస్తున్నందున, దోమల ప్రమాదాన్ని నివారించడానికి లార్వా వ్యతిరేక మరియు ఫాగింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని మరియు కాలానుగుణ వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.